Hydra Commissioner Ranganath : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చెరువుల వద్ద అనుమతులు ఉన్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని తమపై ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న నిర్మాణాలు ముట్టుకోమని సీఎం చెప్పారాని.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ స్పష్టం చేశారు.
కాగా.. శనివారం హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినవారికి మాత్రమే హైడ్రా ఒక భూతం లాంటిదని, వారి పట్ల ఒక అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలను మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవనం వేర్వేరు అంశాలని నొక్కిచెప్పారు. ఇప్పటివరకు మూసీ పరిసరాల్లో కూల్చివేతలే జరగలేదని, హైడ్రా అటువైపు వెళ్ళనే లేదన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు వారి ఫామ్ హౌజ్‌లను కాపాడుకోడానికే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను అస్థిరం చేయడానికి ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. హైడ్రా ఆగదు.. ఆక్రమార్కులకు నిద్ర ఉండదు.. అని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు.
హైదరాబాద్ లో చెరువులు, పార్కలు కజ్జాకు గురి కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అనుకున్నట్లుగానే పని చేస్తోంది. ఇప్పటికే పలు చోట్ల చెరువులు, నాళాలను ఆక్రమించుకుని కట్టిన కట్టడాలను కూల్చేశారు. అలాగే చెరువులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మిస్తున్న కట్టడాలను కూడా నేలమట్టం చేశారు. ఇక సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ లోని కొంత భాగాన్ని పడగొట్టారు. అలాగే చాలా చోట్ల కూల్చివేతలు చేపట్టడంతో బాధితులు హైడ్రాపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే హైడ్రా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటుంది. ఈ మధ్య ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. వ్యతిరేకత వస్తుందని.. సైలెంట్ అయిందా లేక ఇతర కారణాలతో సైలెంట్ అయిందో తెలియరావడం లేదు. అయితే హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల క్రితం చాలా చెరువులు ఉండేవి. అయితే చెరువులు కబ్జా చేస్తూ వెంచర్లు వేస్తూ.. చెరువులు లేకుండా చేశారు. మిగిలిన చెరువులు కూడా కాపాడుకోవాలనే హైడ్రాను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు.