Site icon HashtagU Telugu

Metro Snag: మొరాయిస్తున్న‌ మెట్రో రైళ్లు.. సాంకేతిక లోపాల‌తో స‌మ‌స్య‌లు..!

Metro1

Metro1

గ్రేటర్ నగరానికి మణిహారంలా నిలిచిన మెట్రో రైల్ సాంకేతిక లోపాల‌తో పట్టాలపై నిలిచిపోతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. మూడు నెలల వ్యవధిలో ఐదుసార్లు నిలిచిపోయి ప్రయాణికుల నుంచి మెట్రో ఉన్నతాధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం కూడా సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో నగరవాసులు మెట్రో తీరుపై మండిపడుతున్నారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటామని భావిస్తే కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ విధంగా జరగడంతో ఆలస్యంగా విధులకు చేరుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

రెండు పర్యాయాలు ఎల్బీనగర్, మియాపూర్ రెడ్ కారిడార్ పరిధిలోని అసెంబ్లీ స్టేషన్ వద్ద 30 నిమిషాల‌ పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఆగస్ట్‌లో మూసరాంబాగ్ స్టేషన్‌లో మధ్యాహ్నం వేళ 20 నిమిషాల పాటు మెట్రో ఆగిపోయింది. వెంటనే సిబ్బంది మరమ్మత్తులు చేసి పట్టాలెక్కించారు. మంగళవారం మరోసారి మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో నిలిచిపోవడంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో కారిడార్‌లో ఆరగంట పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మిగతా కారిడార్ల పరిధిలో కూడా రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు సిబ్బంది పేర్కొన్నారు.

టికెట్లు తీసుకున్న వారంతా స్టేషనల్లో గంట పాటు నిరీక్షించారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో జరిగిన అనుభవనాలను దృష్టిలో పెట్టుకుని రైళ్లు నిలిచిపోతున్న ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా గమ్యస్థానాల‌కు చేరుతామని ప్రయాణిస్తే గంటల తరబడి సాంకేతిక కారణాలతో స్టేషన్లలో ఉండాల్సి వస్తుందంటున్నారు. ఇదే విధంగా మెట్రో సేవలుంటే భవిష్యత్తులో నగరవాసులు మెట్రోలో వెళ్లడం కష్టమని పేర్కొంటున్నారు. ఇప్పటికేనా మెట్రో ఉన్నతాధికారులు మెట్రో రైళ్లలో సాంకేతిక లోపాలు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Exit mobile version