Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల సవరించిన టికెట్ ధరలను తిరిగి సమీక్షించి, తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా సవరించిన ఛార్జీలు ఈ శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో పలు రూట్లలో ప్రయాణికులకు మళ్లీ ఆదాయం లేని సమయంలో ఊపిరిపీల్చుకునే అవకాశం లభించనుంది. హైదరాబాద్ మెట్రో మేనేజ్‌మెంట్ తాజా ప్రకటన ప్రకారం, కనీస ఛార్జీ రూ.11గా, గరిష్ఠ ఛార్జీ రూ.69గా నిర్ణయించబడింది. గతంలో రూ.12గా ఉన్న కనీస ఛార్జీని ఇప్పుడు రూ.11కి తగ్గించారు. ఇది ప్రధానంగా చిన్న దూరాలకు ప్రయాణించే వారికి మేలు చేస్తుంది.
దశల వారీగా ఛార్జీ తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి:
9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కి తగ్గింపు
12 నుంచి 15 కి.మీ వరకు రూ.55 నుంచి రూ.51కి తగ్గింపు
15 నుంచి 18 కి.మీ వరకు రూ.60 నుంచి రూ.56కి తగ్గింపు
18 నుంచి 21 కి.మీ వరకు రూ.66 నుంచి రూ.61కి తగ్గింపు
21 నుంచి 24 కి.మీ వరకు రూ.70 నుంచి రూ.65కి తగ్గింపు
24 కిలోమీటర్లకు పైగా రూ.75 నుంచి రూ.69కి తగ్గింపు
కాగా, ఈ నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టికెట్ ధరలు పెరగడంతో ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణించే మాకు భారం అయింది. ఇప్పుడు తగ్గింపు రావడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. మెట్రో ఛార్జీల సమీక్షపై మెట్రో అధికారుల ప్రకటన ప్రకారం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలను సవరించాం. నగర ప్రజలకు మెట్రో ప్రయాణం మరింత చవకగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల్లో ఈ మార్పులు నగర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించనున్నాయి. ఒకవైపు పెరుగుతున్న జీవన వ్యయం మధ్య, ఈ తరహా నిర్ణయాలు ప్రయాణికులకు సాంత్వనగా నిలుస్తున్నాయి. మెట్రో ప్రయాణం మరింత ఆకర్షణీయంగా మారాలంటే మెరుగైన సౌకర్యాల సరఫరాతో పాటు చవక ధరలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.