హైదరాబాద్ (Hyderabad) నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇళ్ల అద్దెలు (House Rent) విపరీతంగా పెరుగుతున్నాయి. ఐటీ, ఫార్మా, విద్య, వైద్య రంగాల్లో విస్తరణతో దేశం నలుమూలల నుంచి ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. ఈ పరిస్థితిలో డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా ఉండటంతో అద్దెలు మితిమీరిపోయాయి. మధ్య తరగతి ప్రజలకు, సాధారణ ఉద్యోగస్తులకు వచ్చే ఆదాయంలో సగం వరకు కేవలం అద్దె కట్టడానికే వెళ్తుండటంతో వారి జీవిత నాణ్యత తగ్గిపోతోంది.
సింగిల్ బెడ్‌రూమ్ (Single Bedroom) కూడా భారమే – డబుల్ బెడ్‌రూమ్ (Double Bedroom) అంటే గగనమే
హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో సింగిల్ బెడ్‌రూమ్‌కు 8,000 – 12,000 రూపాయలు, డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌కి 25,000 – 40,000 రూపాయల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఐటీ కారిడార్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఈ ధరలు మరింత అధికంగా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు 40,000 – 50,000 వరకు అద్దెకు ఉన్నాయి. పైగా మెయింటెనెన్స్ చార్జీలు కూడా భారీగా ఉండటంతో సగటు ఉద్యోగులకు ఇక్కడ ఇంటి అద్దె కట్టడం కత్తిమీద సాము అవుతుంది.
ఇళ్ల ధరలు తగ్గినా అద్దెలు పెరగడమేంటి?
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించింది. ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు పెద్దగా అమ్ముడవడం లేదు కానీ అద్దెలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దీని వెనుక కారణం మంచి ప్రాంతాల్లో కొత్త ఇంటి కొనుగోలుకు ప్రజలు వెనుకడుగు వేయడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడమే. అందువల్ల కొత్త ఇళ్లు కొనలేకపోయిన వారు, మధ్య తరగతి ఉద్యోగస్తులు అద్దె ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగిపోతోంది.
అద్దె నియంత్రణకు ప్రభుత్వ (Govt) జోక్యం తప్పనిసరి
ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానులు ఇష్టానుసారంగా అద్దెలను పెంచుతున్నా, ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. అన్నిస్థాయిల ఉద్యోగస్తులకు తగ్గట్టుగా అద్దె నియంత్రణ పాలసీ అమలు చేయాలని, ఊహించని పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అద్దెదారులకు కొంత ఉపశమనం కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకవేళ అద్దెల పెరుగుదల ఇలాగే కొనసాగితే మధ్య తరగతి ప్రజలు నగరాన్ని వదిలి గ్రామాలకు వెళ్లే పరిస్థితి రావొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Women’s day : మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకుంటే లాభాలే.. లాభాలు