Site icon HashtagU Telugu

EV Batteries: ఎలక్ట్రిక్ బ్యాటరీలను సేఫ్ గా ఉంచేందుకు చిట్కాలు ఇవిగో..

Ev Imresizer

Ev Imresizer

ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చాయి. అయితే కొన్ని కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు దేశంలో పలుచోట్ల పేలడం కలకలం సృష్టించింది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు అనగానే కొందరు అనవసరంగా భయకంపితులు అవుతున్నారు. ఆ బ్యాటరీలు పేలకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలని, భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం సైతం చర్యలకు ఉపక్రమించింది. అటు ఈవీల తయారీ కంపెనీలు కూడా దేశంలో ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా నాణ్యమైన బ్యాటరీలను రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

బ్యాటరీల దీర్ఘాయువును పెంచే చిట్కాలు..

* ఎలక్ట్రిక్ వాహనాన్ని నీడలో పార్క్ చేయండి. ప్లగ్ ఇన్‌లో ఉంచండి. తద్వారా మీ వాహనంలో థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గ్రిడ్ పవర్‌తో మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతల పరిధిని నియంత్రణలో ఉంచండి.

* మీ ఎలక్ట్రిక్ వాహనంలోని బ్యాటరీలు అత్యంత చల్లని, వేడి వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వాటికి రక్షణ కవచాలు తొడగండి.

* నాణ్యమైన బ్యాటరీ రకాలనే ఎంచుకోండి. బ్యాటరీ ఛార్జింగ్ చేసేందుకు ప్రామాణికమైన ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఛార్జర్‌లను పదేపదే మార్చవద్దు.

* బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు ఉపయోగించవద్దు. నిండుగా ఛార్జింగ్ చేయవద్దు. ఎల్లప్పుడు 20 శాతానికి తక్కువ కాకుండా, 80 శాతానికి మించకుండా ఛార్జింగ్ పెట్టుకోవాలి.

* మీ ఎలక్ట్రిక్ వాహనంతో రైడ్ చేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దు. ఒక గంటసేపు పక్కన ఉంచి చల్లబరచడం మంచిది. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

* మీరు ఎలక్ట్రిక్ వాహనం నడిపేటపుడు వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాహనం నీడలో పార్క్ చేయండి. కొద్దిసేపు ఉపయోగించడం ఆపేయండి.

* మీ బ్యాటరీకి సంబంధించి ఎలాంటి సమస్యను గుర్తించినా వెంటనే ఛార్జింగ్ నుంచి తొలగించి, మీ డీలర్‌ను సంప్రదించండి.