Site icon HashtagU Telugu

Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?

Terrorists

Terrorists

Terrorists: జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది. ఈ దాడి బాధ్యతను పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబా (LeT)తో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ స్వీకరించింది. ఫైరింగ్ తర్వాత ఉగ్రవాదులు (Terrorists) పరారీలో ఉన్నారు. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దాడి వివరాలు, ఉగ్రవాదుల సమాచారం

ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఉగ్రవాదులు బాధితుల పేర్లు, మతాన్ని అడిగి, కొందరిని కలిమా చదవమని బలవంతం చేసి గుర్తించిన తర్వాత కాల్పులు జరిపారు. ఈ దాడి 2019 పుల్వామా దాడి తర్వాత జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది.

భద్రతా చర్యలు, ప్రభుత్వ స్పందన

దాడి తర్వాత భారత సైన్యం, CRPF, జమ్మూ-కాశ్మీర్ పోలీసులు బైసరన్ లోయలో విస్తృత శోధన కార్యకలాపాలు చేపట్టాయి. హెలికాప్టర్లు, ఫోలియేజ్ పెనెట్రేటింగ్ రాడార్‌ను ఉపయోగించి ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిగిన ఘర్షణలో భారత సైన్యం ఇద్ద‌రు ఉగ్రవాదులను హతమార్చింది. దీనిని ‘ఆపరేషన్ టిక్కా’గా పిలుస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసి బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఉదయం భారత్‌కు తిరిగి వచ్చారు. మోదీ.. ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమై, మధ్యాహ్నం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర గృహమంత్రి అమిత్ షా సైతం శ్రీనగర్‌కు చేరుకొని బాధితులకు నివాళులర్పించి, గాయపడిన వారిని ఆసుపత్రిలో సందర్శించారు. జమ్మూ-కాశ్మీర్‌లో ఒక రోజు సంతాప దినంగా ప్రకటించబడింది.

Also Read: Pahalgam Terror Attack : పహల్గాం కాల్పులు ..ఉగ్రవాది తొలి ఫొటో !

పాకిస్థాన్ స్పందన

ఈ దాడిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మొదటి స్పందనలో పాకిస్థాన్‌కు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని, తాము అన్ని రకాల ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తామని అన్నారు. ఆయన ఈ దాడి వెనుక భారతీయులే ఉన్నారని, భారత ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ, మైనారిటీలపై (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు) ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఈ దాడి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికుల తిరుగుబాటుగా ఆయ‌న‌ చిత్రీకరించారు.