Site icon HashtagU Telugu

Hijab : హిజాబ్‌లు ధరించడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

hijab ban Mumbai Private College Stay Impose supreme court

hijab ban Mumbai Private College Stay Impose supreme court

Hijab: కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు(Supreme Court) తాత్కాలికంగా నిలిపివేసింది. హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతించింది. ఈ కేసుపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీం స్టే విధించింది. కళాశాల యాజమాన్యం తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థినులు ఏం ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే మహిళా సాధికారికత మాటేంటని ప్రశ్నించింది. కళాశాలలో అందరూ సమానమని, మతాల ప్రదర్శనకు అది వేదిక కాకూడదనే ఉద్దేశంతోనే తాము హిజాబ్‌ని నిషేధించామని.. చెంబూరు(ముంబయి) కళాశాల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై కోర్టు స్పందిస్తూ.. పేర్లల్లో కూడా మతం ఉంటుందని.. మరి దాన్ని ఎలా తొలగిస్తారని కళాశాల యాజమాన్యాన్ని తిరిగి ప్రశ్నించింది. “అమ్మాయిలు ఏం ధరించాలనేది వారి వ్యక్తిగత నిర్ణయం. దేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్న విషయం కళాశాల యాజమాన్యానికి తెలియదా? స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకుపైనే అవుతున్నా.. ఇప్పటికీ ఇలాంటి అంశాలపై చర్చ రావడం దురదృష్టకరం. మేం ఇచ్చిన ఉత్తర్వులను దుర్వినియోగం చేయకూడదు” అని కోర్టు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. కాలేజ్‌లో హిజాబ్ నిషేధంపై పలువురు విద్యార్థినులు సుప్రీం తలుపుతట్టగా.. తాజాగా ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఎవరూ దుర్వినియోగం చేయరాదని అలాంటిదేమైనా జరిగితే తమని ఆశ్రయించవచ్చని.. విద్యా సంఘాలకు సూచించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ‘ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీ’ని నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 18లోగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Read Also: Black Neck: మెడ చుట్టూ నల్లగా ఉందా.. అయితే ఇలా చేయాల్సిందే!