Heavy rains : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఈ మధ్య కాలంలో ప్రకృతీ విపత్తులతో కకావికలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. వర్షాలు కురిసిన దానికన్నా వాటి ప్రభావం మరింత తీవ్రమైంది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్ 20 నుండి జూలై 2వ తేదీ వరకూ వర్షాలతో సంభవించిన నష్టాన్ని ఈ నివేదికలో చర్చించారు.ఈ కాలంలో వర్షాలకు సంబంధించి 12 జిల్లాల్లో మృతులు సంభవించినట్టు వెల్లడించారు. వీటిలో మండీ జిల్లాలో అత్యధికంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు
అలాగే సుమారు 103 మంది గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ముంచెత్తడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, నీటి పంపిణీ, రవాణా మార్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బియాస్ నది మండీ జిల్లాలో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మార్గాన్ని వినియోగించే ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. ముందుజాగ్రత్త చర్యగా మండీ, సిర్మౌర్ జిల్లాల్లో 250కి పైగా రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడగా, 614 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. నీటి సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తం 130 మంచినీటి సరఫరా పథకాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఇటు భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర వాతావరణ పరిస్థితులను గుర్తించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తదుపరి కొన్ని రోజులపాటు వర్షపాతం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో విపత్తు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక పరిపాలనా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పునరావాసం, సహాయక చర్యలు వేగవంతం చేశాయి. ఈ విపత్తుతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను గుర్తించి వారికి తక్షణ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ప్రభుత్వం కూడా సమన్వయంగా స్పందిస్తూ, జనజీవనాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తోంది.
Read Also: Japan Airlines Plane : జపాన్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది