Assam : కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో హృదయాన్ని కదిలించే సంఘటన

కాజీరంగ జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని బోర్జురి గ్రామంలో స్థానికులు ఓ చిన్న ఏనుగు దూడ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాన్ని గమనించారు. దానికి తల్లిదండ్రులు తోడిలేకపోవడం చూసి వారు చాలా చలించిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Published By: HashtagU Telugu Desk
Heart-wrenching incident in Kaziranga National Park

Heart-wrenching incident in Kaziranga National Park

Assam : అస్సాంలోని కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో చోటు చేసుకున్న ఓ హృదయాన్ని కదిలించే సంఘటన. రెండు నెలల వయసున్న ఒక ఏనుగు దూడ, మంద నుండి తప్పిపోయిన తర్వాత, అనేక ఒడిదుడుకుల అనంతరం చివరకు తన తల్లిని తిరిగి కలిసింది. ఈ భావోద్వేగ క్షణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజీరంగ జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని బోర్జురి గ్రామంలో స్థానికులు ఓ చిన్న ఏనుగు దూడ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాన్ని గమనించారు. దానికి తల్లిదండ్రులు తోడిలేకపోవడం చూసి వారు చాలా చలించిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఈ సమాచారంతో అప్రమత్తమైన అటవీ అధికారులు మరియు పశువైద్యుడు డాక్టర్ భాస్కర్ చౌదరి నేతృత్వంలోని రెస్క్యూ బృందం వేగంగా స్పందించారు. ఆ దూడను స్వాధీనం చేసుకొని, అది చెందిన మందను గుర్తించి, దానికి తిరిగి తల్లిని కలిపే చర్యలు చేపట్టారు. రెట్టైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. అందులో ఒక అటవీ అధికారి ఆ దూడ తొండం మరియు కాళ్లపై దాని తల్లి పేడను సున్నితంగా రుద్దుతున్నాడు. ఇది దూడపై ఉన్న మానవ వాసనను తొలగించేందుకు, తల్లి దాన్ని తిరస్కరించకుండా గుర్తించేందుకు చేయబడిన చర్య. ఇది ప్రకృతి మీద అవగాహన ఉన్న అధికారుల చాతుర్యానికి నిదర్శనం.

ఇక, వీడియోలో ఆ దూడ తొలుత భయంతో, గందరగోళంగా ఉండగా, తల్లిని చూసిన తర్వాత ఆనందంగా అడవిలోకి ఆమె వెంట వెళ్లడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అటవీ అధికారులు “జా జా జా (Go Go Go)” అంటూ ఉత్సాహపరిచే శబ్దాలు చేస్తుండటం వినిపిస్తుంది. ఈ మధుర దృశ్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. వీడియోను ఇప్పటివరకు 47 లక్షల 77 వేల మందికి పైగా వీక్షించారు. పలువురు హృదయానికి హత్తుకునే వ్యాఖ్యలు చేశారు. “హ్యాపీ రీయూనియన్!” అని ఓ వినియోగదారు ఆనందం వ్యక్తం చేశారు. “ఇది ఎంత అందమైన కథ! ధన్యవాదాలు పంచుకోవడం కోసం” అని మరొకరు పేర్కొన్నారు. “ప్రకృతికి దాని భాష ఉంది – అటవీ అధికారులు ఆ భాషను ప్రేమగా మాట్లాడారు. ఎంతో ఆలోచనాత్మకమైన చర్య!” అని మరొకరు రాశారు.

కాగా, 1908లో స్థాపించబడిన కాజీరంగ జాతీయ ఉద్యానవనం, 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది ప్రపంచంలో అత్యధికంగా భారతీయ ఒంటి కొమ్ము ఖడ్గమృగాల నివాసం. ఇప్పటికీ ఇక్కడ 2,200కి పైగా ఖడ్గమృగాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం ఏనుగులు, అడవి నీటి గేదెలు, చిత్తడి జింకలు, ఇంకా ఇతర అరుదైన వన్యప్రాణులకు ఆలయంగా నిలుస్తోంది. పులుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో 2006లో కాజీరంగను అధికారికంగా టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ సంఘటన కేవలం ఓ దూడ తన తల్లిని తిరిగి కలుసుకున్న గాథ మాత్రమే కాదు. ఇది మనుషుల మానవతా భావాన్ని, ప్రకృతి పట్ల ప్రేమను ప్రతిబింబించే సంఘటన. అటవీ అధికారుల సత్వర చర్య, స్థానికుల దయా హృదయం, ఇంకా దానిపై నెటిజన్ల స్పందన పై ఈ కథనాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి.

Read Also: Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…

  Last Updated: 07 Jul 2025, 02:39 PM IST