Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించింది. సాంకేతిక సమన్వయం కోసం పూణేలోని భారత వాతావరణ విభాగానికి (IMD) దానిని సమర్పించినట్టు మంత్రి తెలిపారు. జూలై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో, జూలై 4 నుంచి 11 వరకు ప్రయోగానికి విండోగా నిర్ణయించాం అని ఆయన వివరించారు.

Published By: HashtagU Telugu Desk
Government takes key decision to prevent air pollution in Delhi

Government takes key decision to prevent air pollution in Delhi

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో గణనీయంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర చరిత్రలో తొలిసారిగా కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించితే, జూలై 4 నుంచి 11వ తేదీ మధ్య ఈ ప్రయోగాన్ని అమలు చేయనున్నట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించింది. సాంకేతిక సమన్వయం కోసం పూణేలోని భారత వాతావరణ విభాగానికి (IMD) దానిని సమర్పించినట్టు మంత్రి తెలిపారు. జూలై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో, జూలై 4 నుంచి 11 వరకు ప్రయోగానికి విండోగా నిర్ణయించాం అని ఆయన వివరించారు. వాతావరణ పరిస్థితులు ఆ సమయంలో అనుకూలించకపోతే, ప్రత్యామ్నాయ తేదీల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు మరో విండోకు ప్రతిపాదన పంపినట్టు చెప్పారు.

Read Also: Iran: ఇరాన్ రష్యాకు ద్రోహం చేస్తుందా? J-10C ఫైటర్ జెట్లను ఎందుకు కొనుగోలు చేస్తుంది?

ఈ చారిత్రాత్మక కృషిని ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలో పర్యావరణ శాఖ ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి పౌరుడికి శ్వాస తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలి అందించాలన్నదే మా లక్ష్యం. కృత్రిమ వర్షం అనేది ఒక సాహసోపేతమైన, శాస్త్రీయమైన మార్గం. ఇది వాస్తవంగా మార్పును తీసుకురాగలదనే ఆశయంతో ముందడుగు వేస్తున్నాం అని సిర్సా ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీతో నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టును “ఢిల్లీ-ఎన్‌సీఆర్ కాలుష్య నివారణకు ప్రత్యామ్నాయ టెక్నాలజీ ప్రదర్శన, మూల్యాంకనం” పేరుతో రాబోయే వారంలో ప్రారంభించనున్నారు. మొదటి దశలో వాయవ్య ఢిల్లీ, ఔటర్ ఢిల్లీ ప్రాంతాల్లోని తక్కువ భద్రత గల ఎయిర్‌స్పేస్‌లలో ఐదు విమానాలతో ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగాల్లో సిస్నా విమానాలను ఉపయోగిస్తారు. వీటిని ప్రత్యేకంగా మార్చి, మేఘాలపై రసాయన మిశ్రమాలను చల్లేలా తయారుచేశారు. ఒక్కో విమానం సుమారు 90 నిమిషాల పాటు గాలిలో ప్రయాణించి, దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. మేఘాల్లో తేమ ఉన్నప్పుడు, అందులోకి సిల్వర్ అయోడైడ్ నానోపార్టికల్స్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్‌ల మిశ్రమాన్ని చల్లి నీటి బిందువుల ఏర్పాటును ప్రేరేపించి వర్షాన్ని కురిపిస్తారు.

ఈ ప్రయత్నంపై రాజకీయ విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో బీజేపీ ఈ ప్రాజెక్ట్‌ను వ్యంగ్యంగా వ్యాఖ్యానించిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ విమర్శించగా, మంత్రి సిర్సా దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ కృషికి సంబంధించి మొదటి ఒప్పందంపై సంతకాలు చేసినవారమేమే. ఐఐటీ కాన్పూర్‌కు నిధులు విడుదల చేసి, అనుమతుల కోసం దరఖాస్తు చేసిందే మేము. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. కానీ మేము నాలుగు నెలల్లోనే ఈ స్థాయికి వచ్చాం అని ఆయన చెప్పారు. ఈ కృత్రిమ వర్షం ప్రయోగం ఢిల్లీ వాయు నాణ్యతను మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మేఘాలపై ప్రభావం చూపి వర్షం కురిపించడం ద్వారా నగరంపై పేరుకుపోయిన ధూళి, ముద్దుకణాలను కడిగి వేసి కాలుష్యాన్ని తక్కువ చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశంలోని ఇతర కాలుష్య ప్రభావిత నగరాలకు ఇది మార్గదర్శకంగా నిలవనుంది.

Read Also: AP BJP : ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..!

  Last Updated: 30 Jun 2025, 11:22 AM IST