Godrej Group Split : తాళాల నుంచి బీరువాల దాకా.. సబ్బుల నుంచి రియల్ ఎస్టేట్ దాకా.. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇస్రో లాంఛ్ వెహికల్ దాకా ఎన్నో వస్తువుల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్ ‘గోద్రేజ్ గ్రూప్’ !! 1897 సంవత్సరంలో ఆర్దేశిర్ గోద్రేజ్ స్థాపించిన ఈ గ్రూపు అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుతం ప్రతీ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.13వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించే స్థాయికి పురోగమించింది. 126 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రేజ్ వ్యాపార సామ్రాజ్యం విభజన దిశగా అడుగులు పడుతున్నాయి. గోద్రెజ్ గ్రూపులోని గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ అసోసియేట్స్ ఆది గోద్రేజ్, నాదిర్ గోద్రేజ్ సంయుక్త నేతృత్వంలో నడుస్తోంది. గోద్రేజ్ అండ్ బోయిస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఆది, నాదిర్ కు వరుసకు (చిన్నాన్న పిల్లలు) సోదరుడు, సోదరి అయ్యే జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణ నిర్వహిస్తున్నారు. రూ.1.75 లక్షల కోట్లు విలువైన ఈ కంపెనీకి సంబంధించిన వ్యాపార విభాగాల విభజనకు ఇప్పుడు ముమ్మర కసరత్తు జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
గోద్రేజ్ గ్రూప్ విభజనకు 2021 సంవత్సరంలోనూ ప్రయత్నం జరిగింది. అయితే అప్పట్లో ముంబయిలోని విక్రోలి వద్దనున్న 1000 ఎకరాల స్థలం వినియోగించుకునే విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తాయట. వ్యాపార వ్యూహాలు, తదుపరి తరానికి వ్యాపారాల అప్పగింత విషయంలోనూ ప్రస్తుతం అభిప్రాయ భేదాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తులో ఈ విభేదాలు మరింత పెరగకముందే.. వ్యాపార విభజన చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గోద్రేజ్ కుటుంబ సభ్యుల్లో చాలామంది బోర్డు డైరెక్టర్ల హోదాలో ఉండగా.. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్, గృహ ఉపకరణాలు, సెక్యూరిటీ సొల్యూషన్స్, వ్యవసాయ ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్, పలు వినియోగ వస్తువులు ఇలా ఎన్నో వ్యాపారాల్లో గోద్రేజ్ గ్రూప్ (Godrej Group Split) పనిచేస్తోంది. 85కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్ గ్రూప్‌కు సుమారు 120 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు.