Ghost of Kyiv: ” ఘోస్ట్ ఆఫ్ కీవ్ ” ఇక లేడు.. రష్యాకు చుచ్చు పోయించిన ఉక్రెయిన్ సైనికుడి వీరగాధ ఇదిగో!!

రష్యా యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం గా మారి .. రష్యా సైన్యాన్ని పీడకలలా వెంటాడిన ఉక్రెయిన్ వీర సైనికుడు " ఘోస్ట్ ఆఫ్ కీవ్ " ఇక లేడు!

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 01:20 PM IST

రష్యా యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం గా మారి .. రష్యా సైన్యాన్ని పీడకలలా వెంటాడిన ఉక్రెయిన్ వీర సైనికుడు ” ఘోస్ట్ ఆఫ్ కీవ్ ” ఇక లేడు! బాంబుల వర్షం కురిపించే రష్యా యుద్ధ విమానాలకు చుచ్చు పోయించిన ఆ డేర్ డెవిల్ అమరుడయ్యాడు. ఈ సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యం అతడి తండ్రికి చేరవేసింది. దీంతో ఇన్నాళ్ళు అజ్ఞాత వ్యక్తిగా ఉంటూ .. రాజధాని కీవ్ గగనతలం పై ఈగ కూడా వాలకుండే చేయాలనే కృత నిశ్చయంతో పోరాడిన యుద్ధ వీరుడి పై అందరికీ ఆసక్తి పెరిగింది. అతడు ఎవరు ? పేరు ఏమిటి ? ఎలా ఉంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనే తాపత్రయం పెరిగింది. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం ” ఘోస్ట్ ఆఫ్ కీవ్ ” ఫోటో ను విడుదల చేసింది. ఆయన అసలు పేరు .. మేజర్ స్టిపాన్ తారాబల్క అని వెల్లడించింది. వయసు 29 ఏళ్ళని తెలిపింది. మార్చి 13న రష్యా సైన్యం దాడిలో.. ఆయన ప్రయాణిస్తున్న మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయిందని ఉక్రెయిన్ సైన్యం స్పష్టం చేసింది.

ఆయన సాహసాలకు సలాం..

రష్యా సైన్యం ఉక్రెయిన్ పై దాడి చేసిన మొదటి రోజున..6 రష్యా యుద్ధ విమానాలను మేజర్ స్టిపాన్ తారాబల్క కూల్చేశారు. ఆయన కొన్ని వారాల్లోనే మొత్తం 40కిపైగా రష్యా విమానాలను ఒంటి చేత్తో కూల్చారు. దీంతో ఉక్రెయిన్ సర్కారు ఆయనకు “గార్డియన్ ఏంజెల్” బిరుదుతో సత్కరించింది. అయితే భద్రతా కారణాల వల్ల ఆయన పేరు ను అప్పట్లో వెల్లడించలేదు. కేవలం మేజర్ స్టిపాన్ తారాబల్క ముఖాన్ని మాస్క్ తో కప్పుకున్న ఒక ఫోటోను ఆ రోజు ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసింది. నాటి నుంచి ఉక్రెయిన్ ప్రజలు ఆయనను ” ఘోస్ట్ ఆఫ్ కీవ్ ” అని కీర్తించడం ప్రారంభించారు. మేజర్ స్టిపాన్ తారాబల్క అమరుడయ్యాడని తెలిసిన వెంటనే ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయనకు “ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్” అనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. “హీరో ఆఫ్ ది ఉక్రెయిన్” బిరుదు కూడా ఇచ్చింది. మాతృభూమి కోసం పోరాడే ప్రతి ఒక్కరు చరిత్రలో నిలిచిపోయారు అనేందుకు మేజర్ స్టిపాన్ తారాబల్క నిలువెత్తు నిదర్శనం.

చిన్నప్పుడు..

మేజర్ స్టిపాన్ తారాబల్క పశ్చిమ ఉక్రెయిన్ లోని కొరో విల్క గ్రామంలో జన్మించారు. వాళ్ళది పేద కుటుంబం . చిన్నప్పటి నుంచే విమానాలు అంటే ఆయనకు ఇష్టం . బాల్యంలో తమ ఊరి గగనతలం నుంచి వెళ్లే విమానాలను కనురెప్ప కూడా కొట్టకుండా మేజర్ స్టిపాన్ తారాబల్క చూస్తూ కూర్చునే వారు. ” నా కొడుకు చనిపోయాడనే విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం నాకు చెప్పింది . అయితే ఎక్కడ చనిపోయాడు ? అనేది చెప్పలేదు. ” అని మేజర్ స్టిపాన్ తారాబల్క తండ్రి ఇవాన్ ఉద్వేగంతో మీడియా కు చెప్పారు.