Sausage Star: కొత్త నక్షత్రం అంటూ ఫోటో షేర్ చేసిన శాస్త్రవెత్త.. తీరా అదేంటని చూస్తే?

ఈ అనంత విశ్వం 100% ఉంటే అందులో శాస్త్రవేత్తలు కనుగొన్నది కేవలం రెండు శాతం మాత్రమే.  ఇంకా 88%

  • Written By:
  • Updated On - August 8, 2022 / 02:43 PM IST

ఈ అనంత విశ్వం 100% ఉంటే అందులో శాస్త్రవేత్తలు కనుగొన్నది కేవలం రెండు శాతం మాత్రమే.  ఇంకా 98% శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఎన్నో విషయాలు రహస్యాలు ఉన్నాయి. నిత్యం ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నప్పటికీ శాస్త్రవేత్తలకు కొన్ని విషయాలలో సరైన అవగాహన రావడం లేదు. అయితే తరచుగా ఈ అనంత విశ్వానికి సంబంధించిన ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోని ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎటియన్ క్లీన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఆ ఫోటోలో ఎర్రగా మెరుస్తూ గుండ్రటి ఆకారంలో ఉన్ ఓ పదార్థం కనిపిస్తోంది. అయితే ఆ చిత్రంలో ఉన్నది సూర్యుని నుంచి కేవలం నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం అని, సూర్యుడికి అత్యంత సమీప నక్షత్రమైన ప్రాక్సిమా సెంటారీకి చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తాజా ఫొటో అని పేర్కొన్నారు ఎటియన్ క్లీన్. అయితే మొదట ఎటియన్ పోస్ట్ చేసినది అద్భుతంగా ఉందని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత ఆయన అసలు విషయం తెలిపారు. ఆ ఫొటోలో ఉన్నది నక్షత్రం కాదని, స్పానిష్ సాసేజ్ చోరిజో ముక్క అని తెలిపారు. దీంతో ఆ ఫొటోలో ఉన్నది నక్షత్రం అని నమ్మిన చాలా మంది ఎటియన్‌ పై విమర్శలను గుప్పించారు.

దీంతో వెంటనే ఆయన క్షమాపణ తెలిపారు. చాలా మంది తన జోక్‌ను అర్థం చేసుకోలేదని, ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న సమాచారాన్ని సులభంగా నమ్మకూడదని చెప్పడమే తన ఉద్దేశమని ఎటియన్ క్లీన్ తెలిపారు. నకిలీ వార్తలతో పోరాడటం శాస్త్రీయ సమాజానికి అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన ఈ ఫోటో ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయం చాలా మందికి అర్థం కాక అతన్ని విమర్శించారు.