Celestial Wonder : ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు.. అంతరిక్షంలో అద్భుతం.. కాకినాడ జిల్లాలో దర్శనం

ఈ విశ్వంలో మనిషికి అంతుబట్టని వింతలు చాలా ఉన్నాయి. అలాంటివాటిలో ప్లానెట్స్ పరేడ్ కూడా ఒకటి. అలాంటి అద్భుతం అంతరిక్షంలో కనిపించింది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చేసరికీ అందరూ ఆశ్చర్యపోయారు

  • Written By:
  • Publish Date - April 21, 2022 / 12:04 PM IST

ఈ విశ్వంలో మనిషికి అంతుబట్టని వింతలు చాలా ఉన్నాయి. అలాంటివాటిలో ప్లానెట్స్ పరేడ్ కూడా ఒకటి. అలాంటి అద్భుతం అంతరిక్షంలో కనిపించింది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చేసరికీ అందరూ ఆశ్చర్యపోయారు. సైన్స్ పరంగా చూసినా ఇది అరుదైన విషయమే. ఇంకా చెప్పాలంటే సామాన్య జనానికి మాత్రం ఇది అద్భుతమే. అందుకే దానిని ప్రత్యేకంగా షూట్ కూడా చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఈ ఖగోళ వింత కనిపించింది. దీనిని స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించడంతో అందరికీ చూడడానికి వీలైంది. బుధవారం తెల్లవారుజామున 3.49 గంటల నుంచి 5.06 గంటల వరకు ఇది దర్శనమిచ్చింది. నిజానికి ఇది ఇప్పుడిప్పుడే జరిగింది ఏమీ కాదు. గత నెల నుంచి ఇవన్నీ క్రమంగా ఒకే రేఖపైకి వచ్చేలా ప్రయాణిస్తున్నాయి. అదిప్పుడు కనిపించింది.

శనిగ్రహం, అంగారక గ్రహం, శుక్రగ్రహాలు .. మార్చి నెలలోనే ఒకే రేఖపైకి రావడం ప్రారంభించాయి. వీటికి జతగా బృహస్పతి గ్రహం ఏప్రిల్ నెలలో వీటి సరసన వచ్చి చేరింది. దీంతో నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమిచ్చాయి. నిజానికి ఇది చాలా అరుదైన విషయం. అయితే ఇంతకుమించిన అద్భుతం ఈనెల 23న సాక్షాత్కారం కానుంది. దీంతో సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోయే అవకాశం ఉంది.

ఈనెల 23న ఈ నాలుగు గ్రహాలు ఉన్న రేఖపైకి చందమామ కూడా వచ్చి చేరుతుంది. దీంతో మరో అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పుడైతే ఈ సరళరేఖ కుడివైపున జాబిల్లి కనిపిస్తోంది. అది వీటి చెంతకు చేరడానికి ఏప్రిల్ 23 అవుతుంది. ఇలా ఐదు గ్రహాలను ఒకే వరసలో చూడడం నిజంగా ఓ మరపురాని జ్ఞాపకమే అంటున్నారు శాస్త్రవేత్తలు.