NIMS : హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగం 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడటంతో ఆస్పత్రి ఆవరణ అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Read Also: Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఐదవ అంతస్తులో ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉన్నాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కాగా, 5వ అంతస్తులో ఉన్న పేషెంట్లను ఇతర వార్డులకు తరలిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది. మరోవైపు ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో సిబ్బందితో పాటు రోగులు, వారి కోసం వచ్చిన సహాయకులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక, ఈ ప్రమాద ఘటనపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పందించారు. ఐదో ఫ్లోర్ ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. నాలుగో ఫ్లోర్‌లోని రోగుల్ని వేరే వార్డుకి షిఫ్ట్ చేస్తున్నామని, ప్రమాదం జరిగిన చోట రోగులు ఎవరూ లేరని బీరప్ప తెలిపారు. ముందు జాగ్రత్తగా నాలుగో అంతస్తులో కావాలని కరెంట్ ఆపేశామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.
మరోవైపు మంత్రి దామోదర్ రాజనర్సింహా ఈ అగ్నిప్రమాదంపై స్పందించారు. నిమ్స్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరుగలేదని అన్నారు. పేషెంట్లందరినీ సేఫ్ ప్లేస్‌లోకి తరలించినట్లు చెప్పారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ముప్పు ఉంటుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: Abhishek Nayar: కేకేఆర్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అభిషేక్ నాయర్.. క్లారిటీ ఇచ్చిన కోల్‌కతా!