ఎలాన్ మస్క్.. కొత్త ఆవిష్కరణలకు, అద్భుత ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్!!
ఆయన చెప్పింది చేసి చూపిస్తున్నారు..
త్వరలో ఆయన చెప్పిన మరో చారిత్రక ప్రయోగం జరిగేందుకు లైన్ క్లియర్ అయింది..
ఎలాన్ మస్క్ కు చెందిన “న్యూరాలింక్” అనే కంపెనీ మనిషి మెదడులో చిప్‌ను (Chip In Brain) ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టులో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ను(Chip In Brain) ప్రవేశపెట్టి ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వ ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి అనుమతి లభించిందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
“న్యూరా లింక్” కంపెనీ చేస్తున్న ఈ ప్రయోగం మనిషి మెదడును నేరుగా కంప్యూటర్‌లతో లింక్ చేయడానికి ఉద్దేశించినది. ఇందులో భాగంగా తొలుత ఈ ప్రయోగంపై ఆసక్తి ఉన్న వారిని వాలంటీర్లుగా ఎంపిక చేసుకుంటారు. మనిషి మెదడులో పెట్టబోయే ఈ చిప్ ఒక కాయిన్ సైజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే దీన్ని కోతుల మెదడులో అమర్చి ప్రయోగాలు చేశారు. అందులో వచ్చిన ఫలితాలతో రూపొందించిన నివేదికలను ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరా లింక్ కంపెనీ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) కు అందించింది. దాన్ని పరిశీలించిన FDA.. చిప్ ను బ్రెయిన్ లో అమర్చడం వల్ల తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే బ్రెయిన్ చిప్ ను మనుషుల మెదడులో అమర్చి ప్రయోగాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also read : Human Brain: చనిపోయే ముందు మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
మనుషులలో పోయిన కంటి చూపును మళ్ళీ తీసుకురావడం, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడే వారి కండరాలకు చలనం కలిగించడం, న్యూరోలాజికల్ వ్యాధులకు చికిత్స చేయడం బ్రెయిన్ చిప్ ద్వారా సాధ్యమవుతాయని అంటున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా మానవులు మేధోపరంగా మునిగిపోకుండా చూడడమే.. బ్రెయిన్ చిప్ యొక్క అంతిమ లక్ష్యమని ఎలాన్ మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్‌కు కృత్రిమ మేధ (ఏఐ)పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవుల కన్నా తెలివైందని, భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తుందని ఆయన తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ప్రాజెక్టుకు మస్క్ శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన చెబుతున్నారు.