Elon Musk : ఎలాన్‌ మస్క్‌ సొంత సోషల్ మీడియా “X.com”!!

అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఏది చేసినా సంచలనమే!!ట్విట్టర్ తో కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటానని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ ..మరో సెన్సేషనల్ ఐడియాతో ముందుకు వస్తున్నారట.

  • Written By:
  • Publish Date - August 15, 2022 / 09:00 PM IST

అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఏది చేసినా సంచలనమే!!ట్విట్టర్ తో కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటానని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ ..మరో సెన్సేషనల్ ఐడియాతో ముందుకు వస్తున్నారట.ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకొచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.ఈవిధమైన టాక్ వచ్చేటందుకు.. ఇటీవల ఎలాన్ మస్క్ చేసిన సోషల్ మీడియా కామెంట్స్ ముఖ్య కారణమని అంటున్నారు.ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్ల ఎలాన్​ మస్క్​ ఇటీవలే ప్రకటించగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో @టెస్లా ఓనర్‌ ఎస్‌వీ అనే ట్విట్టర్‌ యూజర్‌.. మస్క్​కు ఓ ప్రశ్న వేశాడు. “ఒకవేళ ట్విట్టర్​ డీల్‌ పూర్తిగా రద్దు అయిపోతే .. మరో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మీరు ఏర్పాటు చేస్తారా?” అని ప్రశ్నించాడు. దీనికి మస్క్​ సమాధానంగా X.com అంటూ ట్వీట్ చేశారు. దీంతో మస్క్‌ ఈ పేరుతో కొత్త సోషల్ మీడియా కంపెనీని ప్రారంభించనున్నారంటూ నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.

ఏమిటీ ఎక్స్‌.కామ్‌..

డొమైన్‌ ఎక్స్‌.కామ్‌ అనేది మస్క్‌ గతంలో నిర్వహించిన ఆర్థిక సేవల సంస్థ వెబ్ సైట్. దీన్ని అప్పట్లో పేపాల్‌లో విలీనం చేశారు. తిరిగి 2017లో పేపాల్‌ నుంచి మస్క్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ డొమైన్‌ యాక్టివ్‌లోనే ఉంది. కానీ, అందులో ఎలాంటి సమాచారం లేదు.

గతంలోనూ ఇలాగే చెప్పి.. చేశాడు

ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం ఖరారు చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కూడా మస్క్‌ ఇలాంటి సమాధానమే ఇచ్చారు. ‘‘కొత్త సోషల్‌ మీడియా వేదికను ఏమైనా ఏర్పాటు చేస్తారా?’’ అని మార్చి ఆరంభంలో ఓ యూజర్‌ ప్రశ్నించారు. మస్క్‌ సమాధానమిస్తూ.. ‘‘దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నాను’’ అని బదులిచ్చారు. దీంతో ఆయన కొత్త సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నారని అప్పట్లో తెగ చర్చ జరిగింది. కానీ, కొన్ని రోజులకే ట్విటర్‌ కొనుగోలు ప్రతిపాదనను ముందు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గతంలో ట్రంప్.. ఇప్పుడు మస్క్

గతేడాది అమెరికా అధ్యక్ష పీఠాన్ని వీడిన డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడ్డారు. బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు ఉన్న అన్నీ దార్లను వినియోగించుకొని భంగ పాటుకు గురయ్యారు. తన అనుచరులతో కలిసి అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడ్డారు. దేశ ప్రజలు, సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయితే ఆ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్‌ చేశాయి. దీంతో ట్రంప్‌ సొంతంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ” ట్రూత్‌ సోషల్‌” ను లాంచ్‌ చేశారు.
ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలో ఎలాన్‌ మస్క్‌ సొంతంగా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.