Delhi Liquor Scam : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. 40 చోట్ల ఏక‌కాలంలో రైడ్స్‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు,,

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 10:25 AM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈడీ ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. హైదరాబాద్‌లో సోదాలు చేసేందుకు దాదాపు 25 ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం ప్రాంతంలోని జయభేరి అపార్ట్‌మెంట్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లాతో పాటు.. చెన్నై, బెంగళూరులో కూడా ఈడీ దాడులు జరుగుతున్నాయి. దేశంలోని 40 చోట్ల రైడ్స్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్‌లోని రామచంద్రన్‌ పిళ్లై కంపెనీలు, ఇళ్లు సహా ఆరు చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పిళ్లై హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. అభిషేక్ రావు, జి ప్రేంసాగర్‌ల కార్యాలయాలు, ఇళ్లలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నిష్ సిసోడియాను ఏ1గా పేర్కొంది. IPC సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర) మరియు 477-A (ఖాతాల తప్పుడు సమాచారం) కింద CBI FIR నమోదు చేసింది. మద్యం వ్యాపారులకు రూ.30 కోట్ల మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సుదారులను ఇష్టానుసారంగా పొడిగించారని, పాలసీ నిబంధనలను రూపొందించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.