Site icon HashtagU Telugu

Robert Vadra : ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది: రాబర్ట్‌ వాద్రా

ED is asking the same questions: Robert Vadra

ED is asking the same questions: Robert Vadra

Robert Vadra : కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా హరియాణాలోని భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గురువారం మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగటం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ చర్య తనపై తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకారంగా పేర్కొన్నారు. ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది. 2019లోనూ దర్యాప్తు సంస్థ అధికారులు ఇవే ప్రశ్నలు అడిగారు. కొత్తగా ఏమీ లేదు. ఇది ఈ ప్రభుత్వం మమ్మల్ని తప్పుగా చూపించే ప్రచార శైలి. దీన్ని తట్టుకునే శక్తి మాకు ఉంది అని వాద్రా పేర్కొన్నారు. ఈ రోజు విచారణకు కూడా వాద్రా వెంట ఆయన సతీమణి ప్రియాంక వచ్చారు.

Read Also: Waqf Act : వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

తాను గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అదే తాను బీజేపీలో చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అలాగే తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వాద్రాకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసి తమముందు హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల్లో పది గంటల పాటు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఇక, ఈడీ ప్రకారం.. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.

Read Also: Congo : కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 50 మంది దుర్మరణం