Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

Dasara Offers : వినియోగదారులు ఈ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. వస్తువులు కొనుగోలు చేసే ముందు వాటి తయారీ తేదీ, గడువు తేదీ, ధర, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలి. మోసపోతే వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేసి న్యాయం పొందే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dasara Offers

Dasara Offers

బతుకమ్మ, దసరా పండుగల (Dasara) సీజన్‌ ప్రారంభమవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులు చేసి కొంతమేర ప్రజలపై ఉన్న పన్నుల భారాన్ని తగ్గించడంతో, వినియోగదారులు దుస్తులు, కిరాణా, సూపర్ మార్కెట్లు మొదలైన వాటిలో కొనుగోళ్లు పెంచుతున్నారు. పట్టణాలు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా సూపర్ మార్కెట్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. దీనికితోడు ఆన్‌లైన్ వేదికలు కూడా విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసరాల నుండి ప్రత్యేక వస్తువుల వరకు విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు.

IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

పండుగ సీజన్‌లో వినియోగదారులు తొందరపడి కొనుగోలు చేసే అలవాటు వ్యాపారులకు లాభంగా మారుతోంది. కొంతమంది దుకాణదారులు, సూపర్ మార్కెట్ నిర్వాహకులు గడువు (ఎక్స్పైరీ) తీరిన వస్తువులను కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో గడువు ముగిసిన పానీయాలను విక్రయించడంపై స్థానికులు మున్సిపల్, ఆహార భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆహార భద్రతాధికారుల తక్షణ చర్యలు కనిపించకపోవడంతో వినియోగదారులు మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆహార భద్రతాధికారుల కొరత తీవ్రంగా ఉంది. మంచిర్యాల మినహా నిర్మల్, కుమరంభీం జిల్లాలకు కలిపి ఒక్కరే అధికారి ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఎవరూ లేరు. దీనివల్ల వినియోగదారుల ఫిర్యాదులపై చర్యలు చేపట్టడంలో ఆలస్యం అవుతోంది. అధికారులు వినియోగదారులు మోసపోతే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నప్పటికీ, సకాలంలో తనిఖీలు జరగకపోవడం వలన నాణ్యత లేని, గడువు తీరిన వస్తువుల విక్రయాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులు ఈ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. వస్తువులు కొనుగోలు చేసే ముందు వాటి తయారీ తేదీ, గడువు తేదీ, ధర, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలి. మోసపోతే వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేసి న్యాయం పొందే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

  Last Updated: 27 Sep 2025, 11:51 AM IST