#Dolo650 : త‌యారీదారుడ్ని బిలియ‌నీర్ చేసిన టాబ్లెట్‌..

  • Written By:
  • Updated On - January 22, 2022 / 04:16 PM IST

క‌రోనా ఏమో కానీ.. మాత్ర‌లు త‌యారుచేసే కంపెనీలు మాత్రం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నాయ్‌. ముఖ్యంగా డోలో 650 మందును త‌యారుచేస్తున్న కంపెనీ య‌జ‌మాని అయితే ఈ రెండేళ్ల‌లోనే బిలియ‌నీర్ అయిపోయాడ‌ట‌. మార్చి 2020 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 350 కోట్ల టాబ్లెట్లు అమ్ముడుపోయాయంటే దాని మార్కెట్ ఏంటో అర్ధ‌మ‌వుతుంది.

హెల్త్ కేర్ రంగంలో రీసెర్చ్ చేసే IQVIA అనే సంస్ధ ఏకంగా డోలో టాబ్లెట్ల‌పై ఓ స‌ర్వే నిర్వ‌హించింద‌ట‌. 2019లో కోవిడ్ మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచి బెంగుళూరుకు చెందిన మైక్రోలాబ్స్ తాము త‌యారుచేసిన డోలో టాబ్లెట్లు ఏకంగా 7.5 కోట్లు అమ్మేసింద‌ని తేల్చింది. ఇండియాలో ప్ర‌తీ ఇంట్లో దాదాపు డోలో టాబ్లెట్లు ఉన్నాయ‌ని, ప్ర‌జ‌లు న‌మ్మిన అత్యుత్త‌మ‌మైన టాబ్లెట్ డోలోనేన‌ని అంటోంది. 2021లో టాబ్లెట్ల అమ్మ‌కం ద్వారా కంపెనీ ఏకంగా 307కోట్ల టర్నోవ‌ర్ చేసింద‌ట‌.

అమ్మ‌కాల్లోనే కాదు అటు సోష‌ల్ మీడియాలో కూడా డోలో రికార్డు సృష్టించింది. జ‌న‌వ‌రి 2022 #Dolo650 అనే టాగ్.. ట్విట్ట‌ర్‌లో రెండు సార్లు ట్రెండ్ అయింది. త‌ల‌నొప్పి వ‌చ్చినా జ్వ‌రం వ‌చ్చినా కాస్త న‌ల‌త‌గా ఉన్నా జ‌నం డోలోనే వినియోగిస్తున్నారు. దీంతో డోలోపై అటు ట్రోల్స్ , మీమ్స్ కూడా మొద‌ల‌య్యాయి. .