Thalapathy Vijay: విజయ్ వచ్చింది కేసీఆర్ కోసం కాదా? పీకేను కలవడానికా?

తలపతి విజయ్ హైదరాబాద్ సడెన్ టూర్ వెనక కారణం ఏంటి? యాధృచ్చికంగా వచ్చాడా, పక్కా ప్లాన్‌తో వచ్చాడా?

  • Written By:
  • Updated On - May 21, 2022 / 08:08 AM IST

తలపతి విజయ్ హైదరాబాద్ సడెన్ టూర్ వెనక కారణం ఏంటి? యాధృచ్చికంగా వచ్చాడా, పక్కా ప్లాన్‌తో వచ్చాడా? ఏదో షూటింగ్ జరుగుతోంది, గ్యాప్‌లో వచ్చాడని అనుకోడానికి లేదు. ఎందుకంటే, ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చినప్పటికీ.. సీఎం కేసీఆర్‌తో ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడూ జరగలేదు. అందుకే, కేసీఆర్-విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనపడడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, ఫొటోస్, విజువల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ కేసీఆర్‌తో భేటీ అనుకుంటున్నారు.

కాని, నిజానికి విజయ్ వచ్చింది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలవడానికి అని పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అదేంటి ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో లేడా అనుకోకండి. పీకే ఈ మధ్య పాట్నా, ఢిల్లీ కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. విజయ్ వచ్చినప్పుడు పీకే కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. కాని, ఆ సమావేశం తాలూకు వివరాలు చాలా గోప్యంగా ఉంచారని చెబుతున్నారు.

విజయ్ పీకేను కలవడం నిజమే అయితే.. దాని వెనక పెద్ద ప్లానే ఉన్నట్టు లెక్క. పొలిటికల్ ఎంట్రీకి సైలెంట్‌గా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రజనీకాంత్ తరువాత రాజకీయాల్లోకి వస్తే చూడాలనుకునే హీరో విజయ్ మాత్రమే. అంత ఫ్యాన్ బేస్ ఉంది. పైగా తమిళనాడులో గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన సేవా సంస్థ అయిన విజయ్ మక్కల్ ఇయ్యక్కం సత్తా చాటింది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి పోటీనిచ్చింది.

అందులోనూ తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీకి అవకాశం ఉంది. కరుణానిధి, జయలలిత లేకపోవడంతో.. స్టాలిన్ మాత్రమే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. ఆయన వయసు కూడా అయిపోతోంది. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్
రాజకీయ రంగ ప్రవేశం చేస్తే.. అతినికున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి ఈజీగానే గెలవొచ్చు. బహుశా ఈ లెక్కల్లో పదునెంతో తెలుసుకోడానికి పీకేను కలవడానికి వచ్చినట్టున్నాడు విజయ్. అందులోనూ డీఎంకే తరపున పనిచేసినందున ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్‌కు తమిళనాడు రాజకీయాలపై బాగానే పట్టు ఉంది. సో, ఇన్ని పరిణామాల మధ్య పీకేను కలవడానికి వచ్చి ఉంటాడా అనే టాక్ వినిపిస్తోంది.