అది రోప్ వే.. అందులో జాలీగా ప్రయాణిస్తున్న యాత్రికులకు ఒక్కసారిగా షాక్!! బలమైన గాలులు వీయడంతో. . రోప్ వే ను అకస్మాత్తుగా ఆపేశారు. 5 నిమిషాలు కాదు.. 10 నిమిషాలు కాదు.. ఏకంగా 40 నిమిషాలపాటు 28 మంది యాత్రికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గాల్లోనే ఉండిపోయారు. తాము దర్శించుకోవడానికి వెళ్తున్న ‘మా శారదా దేవి’ ని రక్షించాలంటూ ప్రార్ధించుకున్నారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా మైహార్ హిల్ లో ఉన్న ‘ మా శారదా దేవి’ ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఘటన చోటుచేసుకున్నప్పుడు ఏడు ట్రాలీలు.. ఒక్కో దాంట్లో నలుగురు వ్యక్తులున్నారు. వీళ్లంతా దాదాపు 40 నిమిషాల పాటు గాలిలో ఊగుతూనే ఉన్నారు.
బలమైన గాలులు వీయొచ్చంటూ వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ.. రోప్‌వే నిర్వహణ సేవలను ఆపకపోవడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత ట్రాలీలను కిందకు దించడంతో పెద్దగా ప్రమాదం జరగకుండా భక్తులందరినీ రక్షించారు. గత నెలలో జార్ఖండ్‌లోని డియోఘర్‌లో జరిగిన భారీ రోప్‌వే ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.