Supreme Court : న్యాయవ్యవస్థలో విశ్వాసాన్ని బలపర్చే దిశగా సుప్రీంకోర్టు మరో కీలక చర్య తీసుకుంది. పారదర్శకతను పెంపొందించేందుకు భాగంగా, సుప్రీంకోర్టు సోమవారం (మే 6) న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జడ్జీలు స్వయంగా సమర్పించిన ఆస్తుల సమాచారాన్ని జనానికి ఉచితంగా చూసుకునేలా చేస్తూ ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరచే చర్యగా గుర్తింపు పొందుతోంది.
Read Also: Warning : రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా – కేటీఆర్
ఈ ప్రకారం, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వద్ద రూ.55.75 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్, రూ.1.06 కోట్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో, రూ.1.2 కోట్ల జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వద్ద రూ.14,000 విలువైన షేర్లు, రూ.29,625 LIC పాలసీకి వార్షిక ప్రీమియం, దక్షిణ ఢిల్లీలో ఓ ఫ్లాట్, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో 2,446 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, డల్హౌసీలో ఓ ఇల్లు ఉన్నాయి. ఆయన ఆస్తుల్లో 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, మారుతి స్విఫ్ట్ కారు ఉన్నాయి.
తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బి.ఆర్. గవాయ్ వద్ద బ్యాంకులో రూ.19.63 లక్షలు, రూ.5.25 లక్షల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మహారాష్ట్రలో వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబయి, ఢిల్లీల్లో అపార్ట్‌మెంట్లు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన భార్య వద్ద రూ.29.70 లక్షల ఆభరణాలు, రూ.61,320 నగదు ఉన్నాయి.
ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సూర్యకాంత్ వద్ద చండీగఢ్‌లో ఇల్లు, పంచకులలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, గురుగ్రామ్‌లో స్థలం, రూ.4.11 కోట్ల స్థిర డిపాజిట్లు ఉన్నాయి. 100 గ్రాముల బంగారం, మూడు ఖరీదైన గడియారాలు ఆయన ఆస్తుల్లో ఉన్నాయి.
జస్టిస్ కేవీ విశ్వనాథన్ వద్ద రూ.120 కోట్లకు పైగా పెట్టుబడులు, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్, గుల్మోహర్ పార్క్‌లలో ఆస్తులు, కోయంబత్తూరులో అపార్ట్‌మెంట్ ఉన్నాయి. గత 14 సంవత్సరాల ఆదాయపు పన్ను వివరాలను ఆయన ప్రకటించారు.
ఇంతేకాక, న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ, హైకోర్టు కొలీజియం విధుల వివరాలు, ఇతర సమాచారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Etela Rajender : తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం: ఈటల