Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేఖా గుప్తా ప్రస్తుతం ఊహించని విమర్శల వెల్లువను ఎదుర్కొంటున్నారు. గత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంపై “షీష్‌మహల్” అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆమె, ఇప్పుడు తన అధికారిక నివాసం కోసం భారీ ఖర్చులు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ నివాస్ మార్గ్‌లోని ఒకటో నంబర్ బంగ్లా ఆమె అధికారిక నివాసంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ పనుల విభాగం (పీడబ్ల్యూడీ) రూ. 60 లక్షలు కేటాయించింది. జూన్ 28న జారీ చేసిన టెండర్ ప్రకారం, ఈ మొత్తం ప్రధానంగా ఎలక్ట్రికల్ ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నారు.
Read Also: Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
టెండర్ వివరాల ప్రకారం, రూ. 9.3 లక్షలతో ఐదు టీవీలు, రూ. 7.7 లక్షలతో 14 ఏసీలు, రూ. 5.74 లక్షలతో 14 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ. 2 లక్షలతో యూపీఎస్ వ్యవస్థ అమర్చనున్నారు. అదనంగా, రూ. 1.8 లక్షలు రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే 23 సీలింగ్ ఫ్యాన్ల కోసం, ఓవెన్ టోస్ట్ గ్రిల్ కోసం రూ. 85,000, ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కోసం రూ. 77,000, డిష్‌వాషర్ కోసం రూ. 60,000, గ్యాస్ స్టవ్ కోసం రూ. 63,000, మైక్రోవేవ్‌లు కోసం రూ. 32,000 ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ. 6 లక్షలకు పైగా ఖర్చుతో 115 దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు భారీ షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు టెండర్‌లో పొందుపరిచారు. రెండో నంబర్ బంగ్లాను క్యాంపు కార్యాలయం కోసం వినియోగించనున్నారు. ఈ టెండర్ల బిడ్లు జూలై 4న తెరవనుండగా, 60 రోజుల లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రేఖా గుప్తా తన సొంత నివాసమైన షాలిమార్ బాగ్‌లో నివసిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, రేఖా గుప్తా సీఎం పదవిని స్వీకరించిన వెంటనే, కేజ్రీవాల్ నివాసంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షీష్‌మహల్‌ను మ్యూజియంగా మార్చుతాం అని ప్రకటించిన ఆమె, ఇప్పుడు తానే భారీ ఖర్చుతో తన అధికారిక నివాసాన్ని ఆధునికీకరణ పనులు చేయించుకుంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ గతంలో కేజ్రీవాల్‌పై వేసిన విమర్శలే ఇప్పుడు రేఖా గుప్తాను చుట్టుముట్టినట్లయ్యాయి. ఈ చర్యలపై అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ, ప్రజాధనం పట్ల బహిరంగ ఖర్చులపై పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో షీష్‌మహల్ పేరిట నిందలు వేశారు, ఇప్పుడు అదే బాటలో నడవడం ఏమిటని సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద చర్చ సాగుతోంది. ఈ పరిణామాల మధ్య, ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ ప్రభుత్వ పనుల తీరు పట్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Vallabhaneni Vamsi : సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట