Fengal Cyclone : “ఫెంగల్” తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో కారైక్కాల్-మహాబలిపురం మధ్య ఈ తుపాను ముందు భాగం భూభాగంపైకి చేరుకుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇక ఈ ప్రక్రియ దాదాపు 4 గంటలు పట్టే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీల వేగంతో కదిలిన తుపాను శనివారం రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. మరి కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
తుపాను ప్రభావంతో తిరుపతి , నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తుమ్మలపెంట సముద్రతీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి.
ఫెంగల్ తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అటు, చెన్నై, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 3 విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు రద్దు చేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై ఎయిర్‌పోర్టును మూసేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకూ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను నిలిపేసినట్లు తెలిపారు.
Read Also: Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి.. నిందితుడు అరెస్ట్