Rekha Gupta : అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కానీ మాపై విమర్శలు చేస్తారా..? అంటూ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాజీ సీఎం ఆతిశీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్నేళ్లపాటు మీరేం చేశారో చూసుకోకుండా.. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కానీ మాపై విమర్శలు చేస్తారా..? మొదటిరోజే మేం క్యాబినెట్ సమావేశం జరిపాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చాం. దాంతో ప్రజలకు రూ.10లక్షల మేర వైద్యసహాయం అందనుందన్నారు.
Read Also: KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!
ముందు మీరు మీ పార్టీ గురించి చూసుకోండి. ఎంతోమంది మీ పార్టీని వీడాలని చూస్తున్నారు. కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు అని రేఖ దుయ్యబట్టారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీ తన హక్కులన్నీ పొందుతుందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. గత పదేండ్లలో ఢిల్లీ ప్రజల సొమ్ముకు గత ఆప్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా మారుస్తామని తెలిపారు. వికసిత్ ఢిల్లీ కోసం ఒక్క రోజు కూడా వృథా చేయకుండా తన ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేఖా గుప్తా చెప్పారు.
కాగా, దేశరాజధాని ఢిల్లీలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ మాజీ సీఎం ఆతిశీ విమర్శించారు. ఢిల్లీ మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ విమర్శించారు. ఆతిశీ విమర్శలపై సీఎం రేఖా గుప్తా తాజాగా స్పందించారు.