CM Chandrababu : ఉండవల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) 49వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏర్పాటుకు గల ప్రాంతంలో మౌలిక వసతుల కోసం భారీగా నిధులు కేటాయించనున్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న 1,450 ఎకరాల భూమిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,052 కోట్ల విలువైన టెండర్లను పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద డ్రైనేజ్ వ్యవస్థలు, రహదారులు, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇది నగర నిర్మాణంలో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
Read Also: Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్‌బాక్స్ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!
అదే విధంగా, అమరావతిని దేశీయ రహదారి నెట్‌వర్క్‌తో మరింత బలంగా కలపడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవేకు అనుసంధానించేందుకు రూ.682 కోట్లతో మరో టెండర్‌ను పిలవాలని నిర్ణయించారు. దీనివల్ల నగరానికి జాతీయ రహదారుల ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ..గ్రీన్ అండ్ బ్లూ సిటీ” అనే కాన్సెప్ట్‌ను మరింత బలపర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ప్రకృతి మిత్రమైన నగర నిర్మాణం అమరావతి లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, నీటి వనరుల సంరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించడంపై దృష్టిసారించామని చెప్పారు.
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అధ్యయన పర్యటన గురించి కూడా మంత్రి నారాయణ వివరించారు. లక్నోలో రివర్‌బండ్ ఎలా నిర్మించారో, అక్కడి ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేశామని తెలిపారు. యూపీ అధికారులు కూడా త్వరలో అమరావతికి వచ్చి ఇక్కడి ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ పరస్పర అధ్యయనాలతో అభివృద్ధి ప్రణాళికలు మరింత సమర్థవంతంగా అమలు చేయగలమని చెప్పారు. ఈ విధంగా, అమరావతిని ప్రపంచ ప్రమాణాలకు సరిపడే నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతన దిశలో అడుగులు వేస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి, రహదారి కనెక్టివిటీ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణ యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో అమరావతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నాయి.
Read Also: Lords Successful Chase: సౌతాఫ్రికా 282 పరుగులు ఛేజ్ చేయగలదా? లార్డ్స్‌లో టాప్-5 ఛేజ్ స్కోర్లు ఇవే!