Everyone wants a grain: అంతరిక్షం నుంచే భూమిపైకి జీవం ? ‘ర్యుగు’ ఆస్టరాయిడ్ లోని అమైనో యాసిడ్లలో గుట్టు!

చాలా దేశాలు జపాన్ కు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. తమకు ఆ శాంపిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి ? ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 40 దేశాలు అప్లికేషన్స్ ఇచ్చాయి. ఇంతకీ ఆ శాంపిల్ ఏమిటి ? దానికి ఎందుకు అంత డిమాండ్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 07:00 AM IST

చాలా దేశాలు జపాన్ కు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. తమకు ఆ శాంపిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి ? ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 40 దేశాలు అప్లికేషన్స్ ఇచ్చాయి. ఇంతకీ ఆ శాంపిల్ ఏమిటి ? దానికి ఎందుకు అంత డిమాండ్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

“హాయబుస 2” భూమికి పంపింది..

“హాయబుస 2” అనే జపనీస్ వ్యోమ నౌక అంతరిక్షంలోని గ్రహ శకలాలను (ఆస్టరాయిడ్స్) అధ్యయనం చేస్తోంది. ఇది ‘ర్యుగు’ అనే గ్ర‌హ‌శ‌క‌లం(ఆస్టరాయిడ్) నుంచి శాంపిళ్లను సేకరించి ఒక స్పేస్ క్యాప్సూల్ ద్వారా వాటిని 2020 సంవత్సరంలో భూమికి పంపించింది. వాటిపై పరిశోధనలు చేసిన జపాన్ లోని ఓకాయామా వర్సిటీ శాస్త్రవేత్తలు ..ఆ శాంపిళ్ళలో 20 అమైనో యాసిడ్ లు ఉన్నట్లు గుర్తించారు. మానవ శరీరంలోనూ అమైనో యాసిడ్ లు ఉంటాయి. అమైనో యాసిడ్ అణువులు కలిసి శరీర నిర్మాణానికి అత్యంత కీలకమైన ప్రోటీన్లు ఏర్పడుతాయి. మనం తినే అన్నం జీర్ణం కావడానికి, పిల్లల పెరుగుదలకు, శరీర కనజాలానికి మరమ్మతులు చేసేందుకు అమైనో యాసిడ్స్ అత్యంత అవసరం.మన శరీరానికి శక్తి వనరుగా ఇవి ఉపయోగపడతాయి. ఇంత కీలకమైన అమైనో యాసిడ్స్ .. ‘ర్యుగు’ గ్రహ శకలం శాంపిళ్ళలో ఉండటం అనేది సంచలన విషయమే. అందుకే దాని శాంపిళ్ళను పరిశోధనల కోసం ఇస్తామంటూ జపాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనకు 40 దేశాలు స్పందించాయి. తమకు అంటే తమకు వాటిని కేటాయించాలని విజ్ఞప్తులు చేశాయి. వాటిలో 12 దేశాలనే ఎంపిక చేసిన జపాన్.. ఆయా దేశాలకు గ్రహ శకలం శాంపిళ్ళు అందజేసింది.

ఏం చేస్తారు ?

భూమిపైకి జీవం మొద‌ట ఎలా చేరింది? ఇది ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్నే. ఈ గుట్టు విప్పేందుకు ..‘ర్యుగు’ గ్రహ శకలం శాంపిళ్ళ నుంచి కొన్ని ఆధారాలు లభించవచ్చని ఆశిస్తున్నారు. “ర్యుగు గ్ర‌హ‌శ‌క‌లంపై అమైనో ఆమ్లాల క‌ల‌యిక వ‌ల్ల ఏర్పడే ప్రొటీన్ ఆవిష్క‌ర‌ణ ముఖ్య‌మైన‌ది. ఎందుకంటే ఉల్క‌ల‌లాగా రుగ్యు గ్ర‌హ‌శ‌క‌లం భూమిని ఢీకొట్ట‌లేదు. అంటే జీవం మూలాలు అంత‌రిక్షంలో ఏర్ప‌డ్డాయ‌ని దీని వ‌ల్ల అర్థ‌మ‌వుతోంది” అని రిసెర్చర్లు అంటున్నారు.ఉల్క‌ల‌తో స‌హా మాన‌వాళికి అందుబాటులో ఉన్న ఏదైనా స‌హ‌జ న‌మూనాలో ర్యుగు న‌మూనా అత్యంత ప్రాచీన ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంద‌ని జ‌పాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేష‌న్ ఏజెన్సీ పేర్కొంది. భూమిపై జీవం మూలం అంత‌రిక్షం నుంచే వ‌చ్చింద‌నే దానికి ఈ న‌మూనా నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని తెలిపింది.