Manipur Violence : మణిపూర్ హింసాకాండలో మరో ఐదుగురు మృతి Pasha Published Time : 29 May 2023, 09:42 AM Manipur Violence మణిపూర్లో ఆదివారం జరిగిన హింసాకాండలో(Manipur Violence) ఐదుగురు చనిపోయారు. ఇందులో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవే ఘటనలలో 12 మందికి గాయాలయ్యాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని దుండగులు ధ్వంసం (Manipur Violence) చేశారని వార్తలు వస్తున్నాయి. మణిపూర్ రైఫిల్స్, ఐఆర్బీ స్థావరాల నుంచి ఆదివారం 1,000కిపైగా ఆయుధాలతో పాటు మందుగుండును అల్లరి మూకలు దోచుకున్నారని తెలుస్తోంది. ఖబీసోయ్లోని 7వ మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్, డ్యూలాహ్లేన్లోని 2వ మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్, తౌబాల్లోని 3వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ ల నుంచి కూడా ఆయుధాలు, మందుగుండును అల్లరి మూకలు దోచుకున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కక్చింగ్ జిల్లాలోని సుగ్ను టౌన్ కు సమీపంలో ఉన్న మూడు గ్రామాలలో 200 ఇళ్లను శనివారం అర్థరాత్రి మిలిటెంట్లు తగులబెట్టారని సమాచారం. Also read : Earthquake In Manipur: మణిపూర్ లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 30మంది అనుమానిత కుకీ మిలిటెంట్లను ఎన్ కౌంటర్ చేశామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారమే వెల్లడించారు. అయితే ఆ ఘటనల వివరాలు ఆలస్యంగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి. ఈ ఉద్రిక్తతల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మణిపూర్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మైతై, కుకీలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా శనివారం నుంచి మణిపూర్ లోనే ఉన్నారు. అయినా సాక్షాత్తు మణిపూర్ రాజధాని ఇంఫాల్, పరిసర జిల్లాలలో హింసాకాండ కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది.