Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆ దేశ రాజకీయాల్లో కీలక నాయకురాలైన షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టు ధిక్కరణ కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఆమెకు ఈ శిక్ష విధించినట్లు స్థానిక మీడియా కథనాల్లో వెల్లడైంది. గతేడాది దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాజకీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలే ఈ పరిణామాలకు దారితీశాయని విశ్లేషకుల అభిప్రాయం. 2024లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక మలుపుల్లో ఒకటి, రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు. అప్పట్లో తీవ్రంగా భగ్గుమన్న ఆందోళనల నేపథ్యంలో హసీనా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో హసీనా పదవి నుంచి తప్పుకుని, భారత్‌కు వలస వచ్చిన విషయం తెలిసిందే.
Read Also: Heavy rains : హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
భారత ప్రభుత్వం ఆమెకు తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. ఆందోళనల అనంతరం జరిగిన పరిణామాల్లో శాంతిభద్రతల ఉల్లంఘన, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే చర్యలు, ప్రభుత్వ అధికారం దుర్వినియోగం వంటి అంశాలపై అప్పటి ప్రధాన నేతలు, సలహాదారులు, ముఖ్యమైన సైనికాధికారులు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా సహా పలువురిపై నేర పరంగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ICT ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేయగా, ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో షేక్ హసీనా నిందితురాలిగా నిర్ధారణ కావడంతో ఆరు నెలల జైలు శిక్ష విధించడమే కాకుండా, బంగ్లాదేశ్‌లో ఆమె రాజకీయ భవితవ్యంపై కీలక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రతిస్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అనుచరులు దీన్ని రాజకీయ కక్షగా అభివర్ణిస్తున్నారు.
మరోవైపు హసీనాపై ఇప్పటికే ఉన్న విధ్వంసకర చర్యలు, హత్యారోపణలు వంటి కేసుల్లో విచారణ కొనసాగుతుండటంతో, ఈ శిక్ష మరింత పరిణామాలను ప్రభావితం చేయనుంది. హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందినప్పటికీ, ఈ కేసుల తాలూకు పరిణామాలు ఇంటర్నేషనల్ లావాదేవీలపై ప్రభావం చూపే అవకాశముంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను వెంటనే దేశానికి అప్పగించాలనే అభ్యర్థనతో భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశముంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలు ఎలా మలుపు తిరుగుతాయన్నది గమనించాల్సిన అంశం. షేక్ హసీనా వంటి నేతపై కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష విధించడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించి, కేసులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇప్పుడే వేగం పుంజుకున్నాయి. త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో, ఈ వ్యవహారంపై అంతర్జాతీయంగా కూడా నిగాహా పెట్టాల్సిన అవసరం ఉంది.
Read Also: Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు