Minister Ponnam Prabhakar : నేడు మాజీ ప్రధాని ఇందిరా వర్థంతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
ఈ రోజు యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలో ఇందిరమ్మ ఆదర్శమన్నారు. దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి పేదల పట్ల పూర్తి శ్రద్ధ అన్ని రకాల అంశాలను ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరా గాంధీ స్ఫూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు అని కొనియాడారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పక్షాన హైదరాబాద్ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు ఇందిరాగాంధీకి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారని తెలిపారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి ఇందిరా గాంధీ బలయ్యారన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆమెని అనుసరిస్తూ పీవీ నరసింహా రావు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.