CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈరోజు (సోమవారం) ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. మన్ననూరు ఐటీడీఏ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని, విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం (Forest Rights Act – FRA) కింద ఇప్పటికే సుమారు 6.69 లక్షల ఎకరాల భూమిని 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పంట సాగు కోసం మంజూరు చేశారు. అయితే ఈ భూముల్లో దాదాపు 6 లక్షల ఎకరాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. ఈ సమస్యను పరిష్కరించడమే ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథక ప్రధాన లక్ష్యం. సౌర శక్తిని ఆధారంగా తీసుకొని బోరుబావులు తవ్వి, వాటిపై సౌర పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
Read Also: Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్
గిరిజన రైతుల వద్ద భూమి రెండు ఎకరాలకంటే ఎక్కువ ఉంటే వారి కోసం ప్రత్యేకంగా బోరు తవ్వించి సింగిల్ యూనిట్‌గా వ్యవస్థను అమలు చేస్తారు. అయితే భూమి కొద్దిగా ఉంటే, సమీప రైతులను కలిపి బోర్‌వెల్ యూజర్ గ్రూప్‌లుగా ఏర్పాటు చేస్తారు. ఈ విధానంతో గిరిజన రైతులందరికీ నీటి సౌకర్యం అందించి, సాగు సాధ్యమయ్యేలా చేయనున్నారు. ఈ పథకం అమలులో వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తిస్తారు. అనంతరం జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే తదితర పనులు జరుగుతాయి. జూన్ 25 నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటుతో పాటు అనేక పనులు పూర్తిచేయనున్నారు.
ఈ పథకం మొదటి విడతలో రూ.600 కోట్ల వ్యయంతో 10 వేల మంది గిరిజన రైతుల భూములను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 27,184 ఎకరాల్లో సాగు ప్రారంభించనున్నారు. ఇది గిరిజన రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా కీలకమైన అడుగుగా మంత్రులు అభివర్ణించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా ఈ పథకం మార్గదర్శకంగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుకూలంగా సాగును పెంపొందించే ఈ పథకం, సుస్థిర గ్రామీణ అభివృద్ధికి బాటలు వేస్తుందని అధికారులు వెల్లడించారు.
Read Also: Trade issues : భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: బంగ్లాదేశ్