తెలుగు సీఎంల పౌరుషం హుష్‌! మోడీ, షా ద్వ‌యంపై కేసీఆర్, జ‌గ‌న్ మౌన‌మేల‌.?

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన స్వ‌ర్గీయ ఎన్టీఆర్ వార‌సులుగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలువ‌లేక‌పోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడ‌డానికి వెనుక‌డుగు వేస్తున్నారు. ఒకప్పుడు తెలుగువారంటే కేంద్రం గ‌డ‌గ‌డ‌లాడేది.

  • Written By:
  • Publish Date - October 18, 2021 / 03:38 PM IST

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన స్వ‌ర్గీయ ఎన్టీఆర్ వార‌సులుగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలువ‌లేక‌పోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడ‌డానికి వెనుక‌డుగు వేస్తున్నారు. ఒకప్పుడు తెలుగువారంటే కేంద్రం గ‌డ‌గ‌డ‌లాడేది. కేంద్రం మిథ్య‌, 356 ఆర్డిక‌ల్‌, గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ మీద ఇలా…ఎన్టీఆర్ లేవ‌నెత్తిన అంశాల‌పై ఆనాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ణికిపోయింది. నేష‌న‌ల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా తెలుగువాడి పౌరుషం ఏమిటో నిరూపించాడు. ఎన్టీఆర్‌ త‌‌రువాత ఆ స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచిన ద‌క్షిణ భార‌త నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు లేడు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కిన కేసీఆర్ ఒక్క‌సారిగా మౌనం వ‌హించాడు. ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంత వ‌ర‌కైనా వెళాన‌ని ప్ర‌మాణం చేసిన జ‌గ‌న్ మాట‌త‌ప్పాడు. తెలంగాణ‌, ఏపీ సీఎంలు ఇద్ద‌రూ మోడీ, అమిత్ షా ద్వ‌యం వ‌ద్ద పిల్లులు అయ్యారు. ఫలితంగా 2014 విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను పొంద‌లేని దీన‌స్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ పోరాటప‌టిమ‌ని చూశాం. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆమెలా ఇప్ప‌డు ఎవ‌రూ ఢీ కొట్టడానికి సాహ‌సం చేయ‌లేదు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్ త‌ర‌హాలోనే ప్ర‌స్తుతం దీదీ కేంద్రంపై పోరాటం చేస్తోంది. ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌ను గుర్తు చేస్తోంది. రాష్ట్రాల‌పై మోడీ స‌ర్కార్ కు ఉన్న చిన్న‌చూపును ఎత్తిచూపుతోంది. బెంగాల్ కు జ‌రిగిన అన్యాయంపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తోంది. పౌర‌స‌త్వ బిల్లును బాహాటంగా వ్య‌తిరేకించింది. మోడీ, షా ద్వ‌యం మీద విరుచుకుప‌డింది. ఆమె సాహ‌సంతో తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను పోల్చ‌లేం. పైగా కేసీఆర్, జ‌గ‌న్ ఇద్ద‌రూ మోడీ స‌ర్కార్ పై మౌనం వ‌హిస్తున్నారు. విచిత్రంగా చంద్ర‌బాబు నాయుడు కూడా ప్ర‌తిప‌క్ష‌హోదాలో కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నాడు.

ప్ర‌త్యేకహోదా, పోల‌వ‌రం ప్రాజెక్టుకు 55వేల 656 కోట్లు, పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీని హైద్రాబాద్ నుంచి రాజ‌మండ్రికి త‌ర‌లింపు, హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించ‌డం, విద్యుత్ బ‌కాయిలు 50వేల కోట్ల‌ను పున‌స‌మీక్షించ‌డం, పౌర‌స‌ర‌ఫ‌రాల‌కు సంబంధించి 3వేల 299కోట్లు, గ్రామీణాభివృద్ధి రూపంలో 4వేల‌652కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద పెండింగ్ లో ఉన్న అంశాల‌ను డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం రాత‌పూర్వ‌క విజ్ఞ‌ప్తి చేశాడు. కానీ, కేంద్రం మాత్రం ఆ డిమాండ్ల ను లైట్ గా తీసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌లుమార్లు మోడీ, అమిత్ షా ను క‌లిసి హైద్రాబాద్ కు ఐఐఎం,ఎయిమ్స్, హైద‌రాబాద్‌-నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్, వ‌రంగ‌ల్ లో 1000 కోట్ల టెక్స్ టైల్ పార్క్, ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ, మావోల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి 100శాతం నిధులు, వెనుక‌బడిన ప్రాంతాల కోసం విభ‌జన చ‌ట్టంలో చెప్పిన నిధులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. కానీ, కేసీఆర్ డిమాండ్ల‌ను కేంద్రం ప‌క్క‌న‌ప‌డేసింది.

ఇవే కాకుండా దీర్ఘ‌కాలంగా ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఉన్న నీళ్ల వివాదాల‌కు పరిష్కారం గురించి మోడీ, షా ద్వ‌యం ప‌ట్టించుకోలేదు. ఏపీ, తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం నెర‌వేర్చ‌న‌ప్ప‌టికీ మోడీ స‌ర్కార్ నిర్ణ‌యాల‌కు పార్ల‌మెంట్ వేదిక‌గా కేసీఆర్, జ‌గ‌న్ మ‌ద్ధ‌తు ఇస్తున్నారు. ఆర్డిక‌ల్ 370 ర‌ద్దు, జ‌మ్మూ, క‌శ్మీర్ ల‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప‌క‌టించడం, పౌర‌స‌త్వం బిల్లు(కాబ్‌), ఎన్ఆర్ సీ త‌దిత‌రాల‌ను స‌మ‌ర్థించారు. ఆ బిల్లును తెలంగాణ‌, ఏపీలో అమ‌లు చేయ‌మ‌ని మాత్రం సీఎంలు చెప్పారు మిన‌హా వాటిని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి జై కొట్టారు. ఒన్ నేష‌న్ ఒన్ రేష‌న్ కార్డు, ఒన్ నేష‌న్ ఒన ఎల‌క్ష‌న్‌, ఒన్ నేష‌న్ ఒన్ లాగ్వేజ్ త‌దిత‌రాల‌ను జాతీయవాదం పేరుతో మోడీ స‌ర్కార్ ప‌రిచ‌యం చేస్తోంది. వాటిని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం.

వ్య‌క్తిగ‌త‌మైన వివిధ కార‌ణాల‌తో మోడీ స‌ర్కార్ ను వ్య‌తిరేకించ‌లేని ప‌రిస్థితుల్లో కేసీఆర్‌, జ‌గ‌న్ ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌గ‌న్ నిందితుడు. ఆయ‌న కేసు సీబీఐ ప్ర‌త్యేక కోర్డులో చివ‌రి ద‌శకు చేరుకుంది. ఈ స‌మ‌యంలో మోడీని వ్య‌తిరేకిస్తే..జైలుకు వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ కేంద్రంపై పోరాటం చేయ‌డంలేద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యులపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. విచార‌ణ ద‌శ‌లో ఆ కేసులు ఉన్న‌ప్ప‌టికీ దాదాపుగా బ‌ట్ట‌దాఖ‌లు అన్న‌ట్టు ప‌క్క‌న పెట్టేశారు. ఒక వేళ మోడీ, షా ద్వ‌యంతో విరోధం పెట్టుకుంటే పాత కేసులు తోడే అవ‌కాశం ఉందని కేసీఆర్ మౌనం వ‌హిస్తున్నార‌ని తెలంగాణ స‌మాజంలోని టాక్‌. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు రావ‌డం శోచ‌నీయం.