Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేశారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఆ వెంటనే ఆర్మీ పాలనను చేతుల్లోకి తీసుకోనున్నట్లు అక్కడి మీడియా సంస్థల ద్వారా కథనాలు వెలువడుతున్నాయి. ఆందోళనులు ఉధృతం కావడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించింది.
We’re now on WhatsApp. Click to Join.
గత కొంతకాలంగా రిజర్వేషన్ల(Reservations)కోసం బంగ్లాదేశ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం ఒక్కరోజే వంద మంది మృతి చెందారు. ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా ప్రకటన చేయాలని హసీనా భావించారు.
అయితే సైన్యం సూచనలతో ఆమె కనీసం రాజీనామా రికార్డింగ్ కూడా చేయకుండా ప్రధాని భవనం గానభవన్‌ను వీడారు. ఢాకా వీధుల్లో సైన్యం మోహరించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా నిరసనల్లో వందల మంది(300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించినట్లు తెలుస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా, ఆమె సోదరితో కలిసి ప్రధాని నివాసం వీడినట్లు సమాచారం. అయితే ఆమె ఆశ్రయం కోసం భారత్‌కు వచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. మరోవైపు.. హసీనా ఢాకా విడిచిపెట్టారనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు.
కాగా, బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి కూతురు అయిన షేక్ హసీనా, ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా పేరొందారు. విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు పిలుపునిచ్చిన ‘పూర్ణ్ అసహయోగ్ ఆందోళన్’ ఢాకాతో సహా దేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించింది. జూలైలో ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపందాల్చుతూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి.