Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందని, వాస్తవానికి చైనా దేశానికే ఎక్కువ లాభాలు చేకూరేలా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Kaushik Reddy : ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరలింపు
మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగం విస్తరిస్తుందని కేంద్రం చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే, తయారీ రంగం క్షీణించి, చైనాలో తయారయ్యే వస్తువుల దిగుమతులు రెట్టింపు అయ్యాయి. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాకపోతే మరేమిటి? అని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేసిన రాహుల్, ఆయన నాయకత్వంలో నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని, కానీ ప్రజలకు ఉపయోగపడే పరిష్కారాలు మాత్రం మిస్ అవుతున్నాయన్నారు. 2014లో తయారీ రంగం జీడీపీలో 17 శాతం ఉండగా, ఇప్పుడు అది 14 శాతానికి పడిపోయింది. మనం అసెంబ్లింగ్ పనులకే పరిమితమయ్యాం. పూర్తి స్థాయిలో తయారీ భారత్‌లో జరగడం లేదు. దీనివల్ల ఆర్థిక లాభాలు చైనా దేశానికి వెళ్తున్నాయి అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను కూడా కేంద్రం తగ్గించుతోందని విమర్శించిన రాహుల్, దేశ తయారీ రంగం బలోపేతానికి సమగ్ర సంస్కరణలు అవసరమని అన్నారు. భారతదేశం కేవలం మార్కెట్‌గా కాక, ఉత్పత్తిదారుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి. దేశీయ పరిశ్రమలకు తగిన మద్దతు ఇవ్వాలి. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మన వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకోవాలని, దేశ ఆర్థిక స్వావలంబన కోసం నిజమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్‌ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం