China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!

  • Written By:
  • Publish Date - August 8, 2022 / 09:30 AM IST

చైనాలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేడి చుట్టుముడుతోంది. సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత 70 ఏళ్లలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగాయి.

1951 సంవత్సరం తర్వాత.. ప్రతి పదేళ్లకు ఒకసారి 0.26 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత చైనాలో పెరిగింది. ఇదే వ్యవధిలో మొత్తం ప్రపంచ దేశాల్లో సగటున 0.15 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత మాత్రమే పెరిగింది. రానున్న రోజుల్లోనూ చైనాలో ఈ ఉష్ణోగ్రతల ఉగ్రరూపం కొనసాగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్వింగై – టిబెట్ హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచురాశులు ఉంటాయి. భారీ ఉష్ణోగ్రతల వల్ల ఈ మంచురాశులు కరిగిపోతున్నాయి. ఫలితంగా చైనాలోని సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చైనాలోని ఉత్తర భూభాగంలో ఉన్న హెబి, నైరుతి యునాన్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సీయస్ స్థాయిని దాటాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రభావం చైనాలోని జీవన స్థితిగతులపైనా పడుతోంది. అక్కడి చెరువులు, నదులు, కాల్వల్లోని జల నిల్వలు.. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఆవిరైపోతున్నాయి. ఎండలు పెరగడం వల్ల పంటల దిగుబడి స్థాయి కూడా పెరుగుతోంది.

ఇటీవల చైనాలోని 131 వాతావరణ కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత ఏడాది భారీ ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణ కేంద్రాల సంఖ్య 62 మాత్రమే ఉండగా.. ఇప్పుడది 131కి చేరడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. పంటల సాగు సీజన్లలోనూ హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడానికి వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు కారణం అవుతున్నాయి.