Water On Moon : సూర్యుడికి దగ్గరగా ఉన్న చంద్రుడి భూభాగంపై నీళ్లు!

మనకు రోజూ కనిపించే చంద్రుడిలో దాగిన రహస్యాల గుట్టు విప్పే దిశగా చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడిపై ఉన్న కొన్ని ప్రత్యేకమైన రాళ్లలో నీళ్లు ఉన్నట్లు గుర్తించింది.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 09:00 AM IST

మనకు రోజూ కనిపించే చంద్రుడిలో దాగిన రహస్యాల గుట్టు విప్పే దిశగా చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడిపై ఉన్న కొన్ని ప్రత్యేకమైన రాళ్లలో నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెందిన “షాంగ్‌ఈ-5” లూనార్ ల్యాండర్ 2020 డిసెంబరులో చంద్రుడి నుంచి భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు.. 1731 గ్రాముల మట్టి, రాళ్లతో కూడిన శాంపిల్స్‌ను తీసుకొచ్చింది. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ప్రతి 10 లక్షల శాంపిల్స్‌లో 30 హైడ్రాక్సిల్ భాగాలు ఉన్నట్లు గుర్తించారు. ఇతర పదార్థాలతో నీరు రియాక్ట్ అయినప్పుడు హైడ్రాక్సిల్ ఎక్కువగా ఏర్పడుతుంది. చంద్రుడిపై దొరికిన హైడ్రాక్సిల్ అత్యధిక భాగం “అపటైట్” అనే ఖనిజంలో దొరికిందని, ఇది భూమిపై కూడా చాలా ఎక్కువగా లభిస్తుందని వెల్లడైంది.

చంద్రుడిపై ఈ రాళ్లు ఎక్కడివి ?

సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను “షాంగ్‌ఈ-5” ల్యాండర్ సేకరించింది.చంద్రుడిపై ఉండే
ఆ ప్రాంతం పేరు “ఓషియానస్ ప్రోకెల్లరం ప్లెయిన్”. ఇది లావా పూర్తి స్థాయిలో ఘనీభవించిన తర్వాత ఏర్పడిన మైదాన ప్రాంతం. “వేల కోట్ల ఏళ్ల క్రితం సూర్యుడిపై జరిగిన భారీ విస్ఫోటనాల కారణంగా వెలువడిన రసాయన పదార్థాలు వచ్చి చంద్రుడి ఉపరితలం పై పడి ఉండొచ్చు. అప్పట్లో వాటిలో జరిగిన రసాయనిక చర్యల ఫలితంగానే “ఓషియానస్ ప్రోకెల్లరం ప్లెయిన్” వంటి లావా ఘనీభవించిన ప్రాంతాలు ఏర్పడి ఉంటాయి” అని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ” నేచర్ కమ్యూనికేషన్స్” మ్యాగజైన్‌లో దీనికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. ‘‘తొలిసారిగా చంద్రుడి ఉపరితలం మీద నుంచి పంపిన ఫలితాలు.. చంద్రుడి మీద నుంచి సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబులో పరీక్షించగా వచ్చిన ఫలితాలు రెంటినీ ఉపయోగించి చంద్రుడిపై నీళ్లు ఉన్నాయా? ఎంత మోతాదులో ఉన్నాయి? అని అంచనాలు వేశాం’’ అని నేషనల్ అబ్జర్వేటరీస్ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఏఓసీ) ప్రకటించింది.