Cheetahs: ఆఫ్రికా చీతాలకు ఇండియాలో తొలి డిన్నర్!!

నమీబియా నుంచి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు సెప్టెంబర్ 17న తీసుకొచ్చిన 8 చిరుత పులులు..

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 10:50 PM IST

నమీబియా నుంచి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు సెప్టెంబర్ 17న తీసుకొచ్చిన 8 చిరుత పులులు.. ఎట్టకేలకు ఒక రోజు తర్వాత (సెప్టెంబర్ 18న) ఫుడ్ తిన్నాయి. కొత్త ప్రదేశం కావడంతో పరిసరాలపై అవగాహన కు వచ్చిన తర్వాతే అవి ఆహారం తీసుకున్నాయి. ఈవిషయాన్ని ఆ 8 చిరుతలను పర్యవేక్షణ చేసే అటవీ అధికారులు వెల్లడించారు. సగటున 33 నుంచి 66 నెలల వయసు కలిగిన ఈ చిరుతలు ఆదివారం రోజు సాయంత్రం వాటికి వేసిన ఆహారాన్ని తిన్నాయని చెప్పారు. ముఖ్యంగా సవన్నా, సాశా అనే పేర్లు కలిగిన రెండు చీతాలు కలిసి సరదాగా ఆడుకున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఒబాన్, ఆశ, సిబిలి, సైసా, ఫ్రెడ్డీ, ఆల్తాన్ అనే మరో 6 చీతాలు కూడా మంచి మూడ్ లో కనిపించాయి. అవి తమ స్థావరం వద్దనున్న తొట్టిలోని నీటిని కూడా తాగాయి.

చీతాలు దాదాపు ప్రతి 3 రోజులకు ఒకసారి ఫుడ్ తీసుకుంటాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. నమీబియా అటవీశాఖ కు చెందిన కొందరు అధికారులు కూడా ఇప్పటికీ మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లోనే ఉన్నారు. వారు స్థానిక అటవీ అధికారులతో కలిసి చీతాల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్17న తన బర్త్ డే సందర్భంగా 8 చీతాలను కునో నేషనల్ పార్క్ లోకి వదిలిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆఫ్రికా చిరుతలను భారత అతిథులుగా అభివర్ణించారు. భారత వాతావరణానికి అవి అలవడటానికి కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. కునో నేషనల్ పార్క్ 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వింధ్యాచల్ పర్వతాలకు ఉత్తర దిక్కున ఉంది.

మీకు తెలుసా?

* చీతా అనే పదం.. హిందుస్థానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని.
* చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు ఈ భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్‌ చీతాలు, ఆసియాటిక్‌ చీతాలు, నార్త్‌ఈస్ట్‌ ఆఫ్రికన్‌ చీతాలు, నార్త్‌వెస్ట్‌ ఆఫ్రికన్‌ చీతాలు.
* పిల్లి జాతి వన్యప్రాణుల్లో చీతాలది ఒక ప్రత్యేకమైన జీవనం. మగవన్నీ కలిసి జీవిస్తే.. ఆడ చీతలు మాత్రం ఒంటరిగా కూనలను పెంచుతాయి. పగలంతా వాటిని దాచేసి..  ఎలా వేటాడో నేర్పిస్తాయి. ఇక మగవన్నీ ఒక జట్టుగా ఉండి తమ సరిహద్దుల్ని కాపాడుకోవడంతో పాటు వేటను వెంటాడుతాయి.