‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ఈ పదం ఇప్పుడు మావోలకు (Maoist ) నిద్రపట్టకుండా చేస్తుంది. గత కొద్దీ రోజులుగా వరుసగా మావోలపై ఎన్కౌంటర్ (Encounter) లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు. తాజాగా నిన్నటికి నిన్న ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ‘ఆపరేషన్ కగార్’ అంటే మావోలతో వణుకుపుడుతుంది. మావోయిస్టుల ఆధిపత్యం అనేది లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులను ప్రత్యేక శిక్షణ ఇచ్చి నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలకు పంపిస్తున్నారు. మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన బస్తర్లోని అబూజ్మఢ్ ప్రాంతం ఇప్పుడు సురక్షితంగా మారుతోంది.
Ayodhya Ram : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. దర్శన ముహూర్తం ఉంటుందా ?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కోబ్రా బలగాలు, డ్రోన్ల సాయంతో మావోయిస్టులపై దాడులు జరుగుతున్నాయి. డ్రోన్ల సాయంతో వారి సంచార ప్రాంతాలను గుర్తించి చుట్టుముట్టే వ్యూహంతో ఆపరేషన్ సాగుతోంది. ఈ విధానం కారణంగా మావోయిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది కాలంలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో 42 ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో అగ్రస్థాయి మావోయిస్టు నాయకులతో పాటు 300 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ లు మావోయిస్టుల బలాన్ని దెబ్బతీస్తున్నాయి. వారి కదలికలు నిరోధించడంతో పాటు గడపదాటేందుకు వీలులేని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మావోయిస్టుల ప్రభావం తగ్గించడంలో ఈ ఆపరేషన్ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు చెబుతున్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించి, వారికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘ఆపరేషన్ కగార్’ వల్ల మావోయిస్టుల దాడుల తీవ్రత తగ్గటమే కాకుండా, గ్రామాల ప్రజలకు మరింత భద్రత అందుతోంది.