Helmet : ద్విచక్ర వాహనదారుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా దేశ వ్యాప్తంగా తయారవుతున్న మరియు విక్రయించబడుతున్న తక్కువ స్థాయి హెల్మెట్లపై కేంద్రం కఠినంగా స్పందించింది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి హెల్మెట్లను తయారు చేస్తున్న సంస్థలు మరియు వాటిని విక్రయిస్తున్న రిటైలర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ఐఎస్ఐ మార్క్ ఉన్న మరియు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలనీ స్పష్టం చేసింది. నాణ్యత లేని హెల్మెట్లు ఉపయోగించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాపాయం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని కేంద్రం హెచ్చరించింది.
Read Also: Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
ప్రస్తుతం దేశంలో 21 కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, రైడర్ల భద్రతచాలా కీలకమని ప్రభుత్వం పేర్కొంది. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరని మరోసారి గుర్తు చేసింది. రోడ్ల పక్కన అమ్మబడే చౌక మరియు నకిలీ హెల్మెట్లు గట్టి రక్షణ కల్పించలేవని, ప్రమాద సమయంలో తలకు తీవ్రమైన గాయాలు కలిగించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ల నాణ్యతపై శాస్వతంగా నియంత్రణ ఉండాలని భావించిన కేంద్రం, ఇప్పటికే 2021లో “క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్” అమలులోకి తీసుకువచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే విక్రయించాలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 176 సంస్థలకే ఈ హెల్మెట్లు తయారు చేయడానికి అవసరమైన బీఐఎస్ లైసెన్సులు ఉన్నాయి.నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు బీఐఎస్ అధికారులు దేశంలోని ఫ్యాక్టరీలు, మార్కెట్లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో 500కిపైగా హెల్మెట్ నమూనాలు పరీక్షించగా, నకిలీ ఐఎస్ఐ మార్క్ వినియోగించిన సంస్థలపై 30కి పైగా దాడులు నిర్వహించి, నాణ్యత లేని హెల్మెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నగరంలో మాత్రమే లైసెన్సులు రద్దయిన 9 సంస్థల నుంచి 2,500కుపైగా నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేశారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని, జిల్లా కలెక్టర్లు మరియు పోలీసు శాఖలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ చర్యల ద్వారా నాణ్యతలేని హెల్మెట్ల తయారీ మరియు విక్రయంపై ఒక స్థిరమైన నియంత్రణ ఏర్పడుతుందని, వాహనదారుల ప్రాణ భద్రతకు ఇది ఒక గట్టి అడుగని కేంద్రం స్పష్టం చేస్తోంది. ప్రజల భాగస్వామ్యం కూడా ఈ విధానాన్ని విజయవంతం చేయడంలో కీలకమని అధికారులు అంటున్నారు. హెల్మెట్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా మానవ జీవితాలు రక్షించబడతాయని సూచిస్తున్నారు.