PM Modi: వివాదాస్పదంగా మారిన భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో అమెరికా జోక్యం ఉన్నదని ఇటీవల పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారతదేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేశాయి. చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు. కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించిన వివరాల ప్రకారం జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీ, ట్రంప్‌ల మధ్య సమావేశం జరగాల్సి ఉండగా, ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడం వల్ల భేటీ సాధ్యపడలేదు. అయితే, అనంతరం ఇద్దరూ ఫోన్‌లో 35 నిమిషాలపాటు చర్చించారు.
Read Also: AP DSC : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు కీ విడుదల
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ట్రంప్ ఫోన్ చేసి మోడీకి సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ సంభాషణలో ప్రధాని మోడీ “ఆపరేషన్ సిందూర్”కు సంబంధించిన వివరాలను ట్రంప్‌కు వివరించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు తాత్కాలికంగా ఆ ఆపరేషన్ నిలిపివేసినట్లు తెలిపారు. అయితే, భారత్ ఎప్పటికీ ఇతర దేశాల మద్యవర్తిత్వాన్ని అంగీకరించదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ట్రంప్‌కు చెప్పారు అని మిస్రీ వివరించారు. జీ7 సదస్సులో మోడీ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై భారత్‌కు ద్వంద్వ వైఖరికి తావులేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం అవసరమని మోడీ పేర్కొన్నారు. మిస్రీ వ్యాఖ్యల ప్రకారం, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు లేదా పాక్‌తో సంభంధాలు గురించి ప్రత్యేక చర్చలు జరగలేదని వెల్లడించారు.
కెనడా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా మోడీని అమెరికా పర్యటనకు ట్రంప్ ఆహ్వానించినట్లు మిస్రీ పేర్కొన్నారు. అయితే, అప్పటికే షెడ్యూల్ ఖచ్చితంగా ఉండటంతో మోడీ వెళ్లలేకపోయారు. త్వరలో ద్వైపాక్షికంగా సమావేశం జరపాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. అలాగే, క్వాడ్ సమావేశానికి ట్రంప్‌ను మోడీ భారత్‌కు ఆహ్వానించగా, దీనిని ఆయన అంగీకరించినట్లు, భారత్‌లో పర్యటించాలన్న ఆసక్తి వ్యక్తంచేశారంటూ మిస్రీ తెలిపారు.
Read Also:ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా