Site icon HashtagU Telugu

Harish Rao : కులగణన సర్వే..సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు లేఖ

Harish Rao letter to CM Revanth Reddy

Harish Rao letter to CM Revanth Reddy

Caste Census : తెలంగాణలో రేపటి నుండి కులగణన సర్వే ప్రారంభం కానుంది. అయితే ఈ సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను ప్రభుత్వం నియమించింది. దీంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు బహిరంగ లేఖ రాశారు. కులగణన సర్వే పూర్తి అయ్యే వరకు టీచర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్కూళ్లలో పని చేసి.. ఆ తరువాత మధ్యాహ్నం నుంచి ఇంటింటికి వెళ్లి కులగణన చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘననే. 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ నవంబర్ 1వ తేదీన విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. మీ పాలన పుణ్యమా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలపై ఉన్న నమ్మకం రోజురోజుకీ దిగజారుతున్నది. మీ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయి. ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరీత్యాలలో సహాయ విధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబందించిన విధులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తుంది. ఇవి కాకుండా మరేఇతర పనులకు వినియోగించకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తుంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించుకోవడం విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలినాలి చేసుకునే వారే. అకస్మాత్తుగా ఒంటి పూట బడులు నడపడం వలన పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. పిల్లల చదువులు కుంటుపడటంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. కాబట్టి, విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.

Read Also: AP Mega DSC Notification: రేపే ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..