Mahesh Kumar Goud : తెలంగాణలో నవంబర్ 6 నుండి కులగణన కార్యక్రమం ప్రారంభంకనుంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు.
అంతేకాక.. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కులగణనపై సాహసోపేత కార్యక్రమాలను తీసుకున్నారని చెప్పారు. దీనికి పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నవంబర్ 2న 33 జిల్లాలో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ విభాగాల్లో కుల గణనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా గాంధీభవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇకపోతే..కులగణన ప్రక్రియ ఒక్కో కుటుంబంలోని సభ్యుల సమాచార సేకరణకు మొత్తం 60 ప్రశ్నలను తయారు చేశారు. అవి..మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా?, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఎలా ఉపాధి పొందుతున్నారు?, భూమి ఉందా?, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? ఈ వివరాలన్నీ సేకరించనున్నారు.