AAP : హరియాణా ప్రభుత్వం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయనున్నుట్లు మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. యమునా నదిని బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తున్నారని కేజ్రీవాల్ చేసిన అసంబద్ధమైన ఆరోపణల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తుంటే, మేము చూస్తూ ఊరుకోలేము. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజలు భయపడుతున్నారని అన్నారు.
కాగా, హరియాణాలోని అధికార బీజేపీ ప్రభుత్వం యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నారని కేజ్రీవాల్ సోమవారం ఆరోపించారు. ఈ విధంగా నదిలో విషాన్ని కలిపి ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. అయితే, కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఢిల్లీ జల్ బోర్డ్ తిరస్కరించింది. ఈ ఆరోపణల్లో ఏ నిజం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని ఢిల్లీ జల్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) హితవు పలికారు. ఈ విషయాన్ని ఎల్‌జీ దృష్టికి తీసుకువెళ్లాలని చీఫ్ సెక్రటరీని కోరారు.
ఇక, ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీ విలేకరులతో మాట్లాడుతూ..యమునా నదిని కలుషితం చేయడాన్ని ‘జల ఉగ్రవాదం’ అని పేర్కొన్నారు. హరియాణా నుండి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయి ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని ఆమె తెలిపారు.
Read Also: Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్