Site icon HashtagU Telugu

Calling Bald Is Crime: మగవారిని ‘బట్టతల’ పేరుతో పిలిస్తే అది లైంగిక వేధింపే! ఇంగ్లండ్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు

Bald Man

Bald Man

మగవారికి బట్టతల ఉంటే రెండు రకాలుగా బెంగ తప్పదు. జుట్టు ఊడిపోయి కనిపిస్తే అందం పోతుందన్న బాధ ఓవైపు.. అందరూ బట్టతల అని వెక్కిరిస్తారన్న ఆవేదన మరోవైపు ఉంటుంది. దీంతో వారు మానసికంగా చెప్పుకోలేని బాధతో ఇబ్బందిపడతారు. అలాంటి వారికి కాస్త సాంత్వన ఇచ్చే తీర్పు ఇది. అందుకే జుట్టు లేని మగవారిని పనిచేసేచోట బట్టతల పేరుతో పిలిస్తే.. అది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఇంగ్లండ్ లోని ఓ ట్రైబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది.

వెస్ట్ యోర్క్ షైర్ లో పనిచేసే బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ పై ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి అయిన టోనీ ఫిన్ కేసు పెట్టాడు. ఆయన ఆ సంస్థలో 24 సంవత్సరాల పాటు ఎలక్ట్రీషియన్ గా పనిచేశాడు. కానీ ఆ సంస్థలో సూపర్ వైజర్ గా ఉన్న వ్యక్తి బట్టతల పేరుతో తనను వేధించాడని టోనీ ఆరోపించాడు. పైగా తనపై వివక్ష చూపుతూ.. ఉద్యోగం నుంచి తీసేశారని పిటిషన్ లో వివరించాడు.

ఆయన పెట్టిన కేసులో బట్టతల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది మగవారికి చెందింది. అందుకే తలపై జుట్టు తక్కువ ఉన్నంతమాత్రాన ఆఫీసుల్లో పనిచేసే పురుషులను బట్టతల పేరుతో పిలిస్తే.. అది ఆ వ్యక్తిని అవమానించడమా లేదా లైంగిక వేధింపులకు గురిచేయడమా అన్న టాపిక్ పై షెఫీల్డ్ లోని ఎంప్లాయ్ మెంట్ ట్రైబ్యునల్ లో ఏడాదికి పైగా వాదనలు జరిగాయి.

కిందటేడాది ఫిబ్రవరిలో నమోదైన పిటిషన్ పై ఆ ట్రైబ్యునల్ జడ్జ్ జోనాథాన్ బ్రెయిన్ తోపాటు మరో ఇద్దరు జడ్జ్ లు దీనిపై విచారణ జరిపారు. బట్టతల పురుషులు లేదా స్త్రీలు ఎవరికైనా ఉండొచ్చని వాదించింది. కానీ ట్రైబ్యునల్ మాత్రం మగవారికే ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని అందుకే దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించాలని చెప్పింది. అయినా ఆ పేరుతో పిలవడం వల్ల ఆ వ్యక్తుల గౌరవానికి మచ్చ అని చెప్పింది. పైగా వారిని మానసికంగా వేధించినట్లు అవుతుందని అందుకే దీనిని లైంగిక వేధింపులుగా పరిగణించాలంది.