KTR : తమపై కేసులు పెట్టి విచారణల పేరుతో ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోబోమని, ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పలువురు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఆక్షేపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని విచారణలకు పిలిచి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు పిలిచారు. మళ్లీ 30 సార్లు పిలిచినా, నేను విచారణకు హాజరవుతాను. చట్టాలపై, న్యాయవ్యవస్థపై నమ్మకముంది. నిజం నిలబడుతుందనే నమ్మకం నాకు ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Kommineni Srinivasa Rao : నేడు జైలు నుంచి విడుదలకానున్న కొమ్మినేని శ్రీనివాసరావు
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా కేసీఆర్, హరీశ్ రావును కమిషన్ ముందు కూర్చోబెట్టి మానసిక ఆనందం పొందినవారే, ఇప్పుడు తనను ఏసీబీ విచారణకు పిలిచి అదే విధంగా ఆనందపడుతున్నారని విమర్శించారు. నన్ను అరెస్టు చేసినా భయపడేది లేదు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లాం. ఇప్పుడు అవసరం అయితే మళ్లీ జైలుకు వెళ్తాను. ఒకసారి కాదు, వందసార్లు అయినా వెళ్తాను. నాలుగు గోడల మధ్య విచారణ కాదు, నాలుగు కోట్ల ప్రజల మధ్య విచారణ జరగాలి. నిజాయితీ ఉంటే ఓపెన్‌గా చర్చించుకుందాం. మనిద్దరిపైనా ఏసీబీ కేసులున్నాయి. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ సవాల్ చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసు ద్వారా తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందని, కానీ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో రాష్ట్రం పరువు కోల్పోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ప్రజల దృష్టిని మరల్చేందుకు కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మరిన్ని రాజకీయ అంశాలపై కూడా వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకాన్ని పూర్తిగా ఎన్నికల లక్ష్యంగా మలచారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పర సహకారంతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. మొత్తానికి, కేటీఆర్ మాటలలో ప్రభుత్వం మీద గట్టి ఆరోపణలే కాదు, ప్రజా వ్యతిరేక విధానాలను బహిరంగంగా ఎండగట్టే ప్రయత్నం కూడా ఉంది. విచారణల పేరుతో అరాచకాలను తాము సహించబోమని, ప్రజల న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బలంగా ప్రకటించారు.