Byju’s Cuts Jobs: నష్టాల బాటలో బైజూస్.. ఉద్యోగులపై వేటు!

ఆన్ లైన్ బోధన, టీచింగ్ యాప్స్ కి కాలం చెల్లింది. దీంతో బైజూస్ లాభాలు కూడా ఆవిరయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Byju’s Lay Off

Byjus

కరోనా కాలంలో ఆన్ లైన్ టీచింగ్ (Online Teaching) అనేది సరికొత్త ఉపాధిగా మారింది. ఆన్ లైన్ టీచింగ్ యాప్ (Apps) లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే కరోనాకంటే ముందుగానే ఆ రంగంలో పాతుకుపోయిన బైజూస్ (Byju’s) సంస్థ.. కరోనా కష్టకాలంలో మరింతగా పుంజుకుంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడటంతో అందరూ బడిబాట పట్టారు. ఆన్ లైన్ బోధన, టీచింగ్ యాప్స్ కి కాలం చెల్లింది. దీంతో బైజూస్ లాభాలు కూడా ఆవిరయ్యాయి, ఫలితంగా ఆ ప్రభావం ఉద్యోగులపై పడింది. లే ఆఫ్ లతో బైజూస్ (Byju’s) ఉద్యోగులు హడలిపోతున్నారు. తాజాగా ప్రకటించిన లే ఆఫ్ లో వెయ్యి నుంచి 1500మందికి బైజూస్ ఉద్వాసన పలకబోతోంది.

గతేడాది అక్టోబర్ లో తొలిసారిగా బైజూస్ లే ఆఫ్ ప్రకటించింది. 2500మందిని ఇంటికి పంపించింది. ఆ తర్వాత ఇక తొలగింపులు ఉండవని బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్ (CEO Ravindran) ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉద్యోగుల్ని తొలగించకపోతే సంస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతోంది బైజూస్. దీంతో ఎక్కడికక్కడ కోతలు పెట్టుకుంటూ వెళ్తోంది. ఏయే విభాగాల్లో.. లాజిస్టిక్స్, కస్టమర్ కేర్, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వంటి కొన్ని విభాగాలను అవుట్ సోర్సింగ్ కి ఇవ్వడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అందుకే ఆయా విభాగాల్లో ఉద్యోగులను తొలగించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్, డిజైన్, ప్రొడక్షన్ విభాగాల్లో ఉద్యోగులను గతంలో తొలగించారు, ఆ విభాగాలపై వేటు వేయడం ఇది రెండోసారి. జీతాలు (Salaries) ఎక్కువ ఉన్నవారిపైనే వేటు వేస్తున్నట్టు తెలుస్తోంది. వార్షిక వేతనం కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉన్నవారిపైనే వేటు పడింది.

బైజూస్ (Byju’s) తో పాటు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇతర ఎడ్ టెక్ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వేదాంతు, అనకాడమీ కూడా తమ ఉద్యోగులను తొలగించాయి. వేదాంతు ఇటీవల 11.6 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులను కలిపి 1,100 మందిని పక్కనపెట్టింది. అనకాడమీ కూడా తొలగింపులు మొదలు పెట్టింది.

Also Read: K Viswanath Biography: ప్రతీ సినిమా ఓ సాగర సంగమమే!

  Last Updated: 03 Feb 2023, 12:16 PM IST