Year 2050 Drought: 2050 కల్లా 75 శాతం జనాభా కరువు కోరల్లోకి!?

కరువు కబలిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెడుతోంది.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 12:54 PM IST

కరువు కబలిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెడుతోంది. 2050 సంవత్సరం కల్లా ప్రపంచంలోని 75 శాతం జనాభా కరువుతో ప్రభావితం కానుందట. ప్రత్యేకించి మన ఇండియాపై ఈ ప్రభావం చాలా ఎక్కువట. 1997 సంవత్సరం నాటికే మన దేశంలోని కరువు పీడిత ప్రాంతాల సంఖ్య 57 శాతం పెరిగిందట. 5 కోట్ల మంది భారతీయులపై కరవు ప్రభావం పడుతోంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు (రెండు దశాబ్దాల్లో) ప్రపంచ వ్యాప్తంగా కరువు ప్రాంతాల సంఖ్య దాదాపు 29 శాతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

ఏటా జూన్ 17..

ఏటా జూన్ 17వ తేదీన కరువుపై ప్రజా చైతన్య దినంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా కరువుకు గల కారణాలు ఏమిటి? దాని చెరలోకి పల్లెలు, పట్నాలు చిక్కకుండా ఏం చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. కరువు వల్ల నేలలు సారాన్ని కోల్పోయి.. మళ్లీ పంటలు పండించే యోగ్యతను కోల్పోతున్నాయి. ఫలితంగా వ్యవసాయం సంక్షోభంలో పడి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీటి ఎద్దడితో గొంతెండుతున్న పల్లెల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లి బిందెల్లో తాగు నీటిని తెచ్చుకునే పరిస్థితులు ఎంతోమంది పల్లెజనులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కార్టూన్లు, యానిమేషన్, వీడియోలతో ప్రజలను చైతన్యం చేయాలనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి పురోగమిస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.