Site icon HashtagU Telugu

Brighter Meteor Shower: నేడు, రేపు ఉల్కల వర్షం.. గంటకు 1000 ఉల్కల మెరుపు.. మన దేశంలో చూడొచ్చా?

New Meteor

New Meteor

ఈరోజు రాత్రి.. రేపు వేకువజామున
ఆకాశ వీధిలో ఉల్కల వర్షం కురియనుంది. ” 73P/SW3 ” (Schwassmann-Wachmann 3 ) అనే తోక చుక్క విచ్చిన్నం అయ్యే క్రమంలో విడుదలయ్యే ధూళి మేఘాలలో నుంచి ఉల్కలు వర్షించనున్నాయి. ఈ ఉల్కలకు శాస్త్రవేత్తలు “టౌ హెర్క్యూలైడ్స్” (Tau Herculids) అనే పేరు పెట్టారు. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున ప్రతి గంటకు దాదాపు 1000 ఉల్కలు తోకచుక్క నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

అకస్మాత్తుగా ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది ? అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. 73P/SW3 తోక చుక్క సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి 5.4 ఏళ్ళు పడుతుంది. ఈక్రమంలో ఈ తోక చుక్కను ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో మనం భూమి నుంచి చూడొచ్చు. 1995 కు ముందు వరకు ఇది కాంతివంతంగా ఉండేది. అయితే 1995 లో 73P/SW3 తోకచుక్క విచ్చిన్నం అయ్యే ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దాని కాంతి శక్తి ఏకంగా ఏడింతలు పెరిగింది. ఇప్పటికే ఈ తోకచుక్క 68 ముక్కలైందని నాసా పరిశోధకులు గుర్తించారు. అలా ముక్కలైన 73P/SW3 తోకచుక్క నుంచే ఇప్పుడు ఉల్కల వర్షం కురవబోతోంది. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున తోకచుక్క ధూళికణాలకు భూ వాతావరణం చేరువ కానుంది. ఇందువల్లే మనకు ఉల్కల వర్షాన్ని చూసే అవకాశం దక్కుతుంది. అలా అని అన్ని దేశాల వాళ్ళు చూడలేరు. మన ఇండియాలోనూ ఇది కనిపించదు. ఉత్తర అమెరికా లోని కొన్ని ప్రాంతాల వాళ్ళు మాత్రమే దీన్ని చూడగలరు.

Exit mobile version